Doomscrolling: మీరూ చేస్తున్నారా డూమ్‌ స్క్రోలింగ్‌?

తాజా వార్తలు

Published : 24/10/2021 10:39 IST

Doomscrolling: మీరూ చేస్తున్నారా డూమ్‌ స్క్రోలింగ్‌?

అదేపనిగా కొవిడ్‌ ప్రతికూల కథనాలను చూస్తే మానసిక ఆరోగ్యంపై ప్రభావం

లండన్‌: ‘‘కొవిడ్‌ కారణంగా పెరుగుతున్న మరణాలు... కరోనాతో దీర్ఘకాల రుగ్మతలు... రోగులతో ఆసుపత్రులు కిటకిట..’’- సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి ప్రతికూల కథనాలను ఎక్కువగా చూస్తున్నారా? అయితే, మీరు ‘డూమ్‌ స్క్రోలింగ్‌’ చేస్తున్నారన్న మాట! కొవిడ్‌ మహమ్మారి తలెత్తినప్పటి నుంచి ప్రపంచమంతటా చాలామంది ఇదే చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో వచ్చే కొవిడ్‌ ప్రతికూల కథనాలను ఒకదాని తర్వాత ఒకటిగా చూసుకుపోతుండటమే...‘డూమ్‌ స్క్రోలింగ్‌’. దీని కారణంగా భావోద్వేగ సమతుల్యత, మానసిక ఆరోగ్యం దెబ్బతింటున్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్రిటన్‌కు చెందిన ఎస్సెక్స్, సైమన్‌ ఫ్రాసెర్‌ వర్సిటీల మనస్తత్వ నిపుణులు కేథరీన్, గిలియన్‌ శాండ్‌స్ట్రోమ్, లారా ఆక్నిన్, షాబాలు ఈ అంశంపై అధ్యయనం సాగించారు. డూమ్‌ స్క్రోలింగ్‌తో లాభమా? నష్టమా? సామాజిక మాధ్యమాల్లో ప్రతికూల వార్తలపై ఎంత సమయం గడిపితే సమస్యగా పరిగణించాలి? దీనికి విరుగుడేమిటి? అన్న అంశాలను వారు పరిశీలించారు. ‘‘నిరుడు మార్చిలో కొవిడ్‌-19పై ట్విటర్, యూట్యూబ్‌ తదితర వేదికల్లో వచ్చిన కథనాలను చదివిన సుమారు 6వేల మందిని ప్రశ్నించాం. డూమ్‌ స్క్రోలింగ్‌ తర్వాత తమలో విచారభావన ఏర్పడినట్టు వారు తెలిపారు. మహమ్మారికి సంబంధించిన సాధారణ వార్తలను మాత్రమే చూసేవారి మానసిక స్థితి కాస్త ఫర్వాలేదు. కొవిడ్‌ ప్రతికూల కథనాలను తక్కువలో తక్కువ 2-4 నిమిషాలు చూసినా... మనస్థితిపై నెగెటివ్‌ ప్రభావం ఉంటోంది. కరోనా వార్తలను అస్సలు పట్టించుకోనివారి మనస్థితిలో ఏ మార్పూ లేదు. సాధారణంగా స్ఫూర్తిదాయక కథనాలు మనసును ఉత్తేజపరుస్తాయి. కానీ, కరోనా సమయంలో మానవతా సాయానికి సంబంధించిన స్ఫూర్తిదాయక కథనాలు మాత్రం చాలామందిలో అలాంటి భావన కలిగించలేదు. ఇవి కూడా కొవిడ్‌కు సంబంధించిన అంశాలు కావడమే ఇందుక్కారణం.

సానుకూలతకే చోటివ్వాలి 

ఇతరులతో ముఖాముఖి మాట్లాడటం అంతగా సురక్షితం, సాధ్యం కాదు. ఇలాంటప్పుడు సామాజిక బంధాలను కొనసాగించేందుకు సోషల్‌ మీడియా ఉపయోగపడుతుంది. కానీ... వాస్తవ సమాచారం తెలుసుకోవడానికి, ఆహ్లాదకర ప్రకృతి దృశ్యాలను తిలకించడానికి, స్ఫూర్తిదాయక కథనాల కోసం, జీవితంలో జరిగే శుభ పరిణామాలను పంచుకోవడానికి; ఇతరులను అభినందించడానికి మాత్రమే సామాజిక వేదికలను ఉపయోగించుకోవాలి’’ అని అధ్యయనకర్తలు సూచించారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని