Jackie Chan: చైనా కమ్యూనిస్టు పార్టీలోకి జాకీ చాన్‌!

తాజా వార్తలు

Updated : 13/07/2021 13:33 IST

Jackie Chan: చైనా కమ్యూనిస్టు పార్టీలోకి జాకీ చాన్‌!

 చేరడానికి ఆసక్తిగా ఉన్నట్లు గ్లోబల్‌ టైమ్స్‌ వెల్లడి

బీజింగ్‌: చైనాకు చెందిన ప్రముఖ సినీ నటుడు జాకీ చాన్‌.. అధికార కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ చైనా(సీపీసీ)లో చేరడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల చైనా సినీ ప్రముఖుల మధ్య జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో జాకీ చాన్‌ తన మనసులోని మాట బయటపెట్టారని ఆ దేశ అధికారిక పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ సోమవారం పేర్కొంది. సీపీసీ శతాబ్ది వేడుకల సందర్భంగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ చేసిన ప్రసంగంపై ఈ కార్యక్రమంలో చర్చ జరిగిందని, అందులో జాకీ చాన్‌ మాట్లాడుతూ సీపీసీ విధానాలను ప్రశంసించారని తెలిపింది. ‘‘సీపీసీ గొప్పతనం కళ్లముందే కనపడుతోంది. అది ఏం చెబుతోందో, ఏం వాగ్దానం చేస్తోందో, వాటిని తప్పక నెరవేరుస్తుంది. అందుకు వందేళ్లు అవసరం లేదు. కొన్ని దశాబ్దాల సమయం చాలు.

నేను ఆ పార్టీ సభ్యుణ్ని కావాలనుకుంటున్నాను’’ అని చైనా ఫిలిం అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడైన జాకీ చాన్‌ వ్యాఖ్యానించినట్లు గ్లోబల్‌ టైమ్స్‌ తెలిపింది. హాంకాంగ్‌లో నివసిస్తున్న 67 ఏళ్ల జాకీ చాన్‌ ముందు నుంచీ సీపీసీకి మద్దతు పలుకుతున్నారు. హాంకాంగ్‌లో ప్రజాస్వామ్యవాదుల నిరసనను అణచివేయడానికి సీపీసీ చేపట్టిన చర్యలనూ ఆయన సమర్థించారు. ఈ విషయంలో ఆయన తీవ్ర విమర్శలకు గురయ్యారు. వివిధ రంగాల్లోని ప్రముఖులను సలహాదారులుగా నామినేట్‌ చేస్తూ సీపీసీ ఏర్పర్చిన ‘చైనీస్‌ పీపుల్స్‌ పొలిటికల్‌ కన్సల్టేటివ్‌ కాన్ఫరెన్స్‌’లో జాకీ చాన్‌ సభ్యుడిగా కొనసాగారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని