దురాక్రమణదారులు శ్వేతసౌధాన్ని ఖాళీ చేయొచ్చు!

తాజా వార్తలు

Published : 07/11/2020 11:31 IST

దురాక్రమణదారులు శ్వేతసౌధాన్ని ఖాళీ చేయొచ్చు!

బైడెన్‌ మద్దతుదారులు

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షపీఠంపై అనిశ్చితి కొనసాగుతోంది. ఓ వైపు లెక్కింపు ప్రక్రియ పూర్తి కాకముందే ఇరు పార్టీల మద్దతుదారులు పరస్పరం విమర్శలకు దిగుతున్నారు. ట్రంప్‌ ఇక శ్వేతసౌధాన్ని ఖాళీ చేయొచ్చని బైడెన్‌ తరఫు అధికార ప్రతినిధి ఆండ్రూ బేట్స్‌ అన్నారు. ‘‘ మేము గత జులై 19న చెప్పినట్లుగా అమెరికా ప్రజలు విజేతను నిర్ణయించారు. దురాక్రమణదారులను అమెరికా ప్రభుత్వం ఇక శ్వేతసౌధం నుంచి ఖాళీ చేయించొచ్చు’’ అని వ్యాఖ్యానించారు. అధ్యక్షుడు ట్రంప్‌ గతంలో  ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఒక వేళ బైడెన్‌ గెలుపొందినా.. అధికార మార్పిడి అంత సులభంగా జరగదని వ్యాఖ్యానించిన నేపథ్యంలో అండ్రూ బేట్స్‌ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.

అటు ఫలితాలు తేలాల్సి ఉన్న ఐదు రాష్ట్రాల్లో లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.మరోవైపు స్పష్టమైన మెజార్టీతో గెలవబోతున్నామని డెమొక్రాటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ చెబుతున్నారు. ట్రంప్‌పై 40 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొదట్లో ట్రంప్‌ ఆధిక్యంలో ఉన్న జార్జియాలోనూ బైడెన్‌ ఆధిక్యంలోకి వచ్చారు.  ప్రస్తుతం 4,020 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక్కడ 16 ఎలక్టోరల్‌ ఓట్లు ఉన్నాయి. అయితే ఇక్కడ రీ కౌంటింగ్‌ చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. 20 ఎలక్టోరల్‌ ఓట్లు ఉన్న పెన్సిల్వేనియా, 6 ఎలక్టోరల్‌ ఓట్లు ఉన్న నెవాడాలోనూ బెడెన్‌ హవా కొనసాగుతోంది. ఇప్పటికే 264 ఎలక్టోరల్‌ ఓట్లు సాధించిన బైడెన్‌ మేజిక్‌ ఫిగర్‌కు కేవలం 6 ఎలక్టోరల్‌ ఓట్ల దూరంలోనే ఉన్నారు. దీంతో ఈ మూడు రాష్ట్రాల్లో ఏ ఒక్కటి గెలిచినా బైడెన్‌ విజయం తథ్యమైనట్లే. ఒక వేళ అలస్కా (3), అరిజోనా (11)లో ట్రంప్‌ విజయం సాధించినా మ్యాజిక్‌ ఫిగర్‌కు చేరువ కాలేరు. దీంతో బైడెన్‌కే గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పొచ్చు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని