close

తాజా వార్తలు

Published : 07/08/2020 08:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అణ్వస్త్ర దాడిని తలపించిన  విధ్వంసం

హిరోషిమాపై వేసిన అణుబాంబులో ఐదో వంతు శక్తి ఉత్పత్తి 
200 కిలోమీటర్ల వరకు వినిపించిన బీరుట్‌ పేలుడు ధ్వని 

అణు బాంబే పేలిందా అన్నంతగా విధ్వంసం.. భూకంపం వచ్చిందా అన్నట్లుగా కుప్పకూలిన నిర్మాణాలు.. సముద్రుడు ఆగ్రహించి నగరాన్ని మింగేయబోయాడా అనుకునేంతగా ఎగిసిపడ్డ అలలు.. మునిగిపోయిన నౌకలు.. లెబనాన్‌ రాజధాని బీరుట్‌లో మంగళవారం చోటుచేసుకున్న పేలుడుతో చోటుచేసుకున్న బీభత్సమిది. నగరంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా కుప్పకూలిన భవనాలు, విరిగిన తలుపులు, పగిలిపోయిన అద్దాలు, రోడ్ల నిండా గాజు ముక్కలే దర్శనమిస్తున్నాయి. తాజా దుర్ఘటన దెబ్బకు బీరుట్‌లో దాదాపుగా మూడు లక్షల మంది నిరాశ్రయులయ్యారు. వేల మంది చికిత్స కోసం ఆస్పత్రుల ముందు బారులు తీరారు. ఇప్పటికే కొవిడ్‌ రోగులతో ఆస్పత్రులు నిండిపోవడంతో పడకలు దొరక్క క్షతగాత్రులు అల్లాడుతున్నారు. అణు బాంబులో ఐదో వంతు శక్తి స్థాయిలో తాజా పేలుడు చోటుచేసుకుందని నిపుణులు చెబుతున్నారంటే.. దాని విధ్వంసాన్ని అర్థం చేసుకోవచ్చు. 

అక్రమ రవాణా నౌక చిక్కడంతో.. 
2,750 టన్నుల అమ్మోనియం నైట్రేట్‌ పేలిపోవడంతో బీరుట్‌లో తాజా దుర్ఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అయితే- ఆ పదార్థం వాస్తవానికి లెబనాన్‌ ఉత్పత్తి చేసుకున్నదో.. తమ అవసరాల కోసం దిగుమతి చేసుకున్నదో కాదు. 2013లో జార్జియా నుంచి మొజాంబిక్‌కు వెళ్తున్న ఎం.వి.రోహ్‌సస్‌ అనే ఓ నౌక బీరుట్‌ సమీపంలో ఇంజిన్‌ చెడిపోవడంతో ఆగిపోయింది. దీంతో చాలా శ్రమించి దాన్ని బీరుట్‌ ఓడరేవుకు చేర్చారు. ఆ నౌక సైప్రస్‌లో నివసించే రష్యా వ్యాపారవేత్తకు చెందినది. నౌకాశ్రయానికి చేరుకున్నాక తనిఖీలు చేపట్టగా.. సదరు నౌకకు ప్రయాణార్హత లేదని తేలింది. అమ్మోనియం నైట్రేట్‌ రవాణాకు అనుమతులు తీసుకోలేదనీ స్పష్టమైంది. దీంతో లెబనాన్‌ అధికారులు ఆ పదార్థాన్ని జప్తు చేసి.. సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. నౌకలో భారీ మొత్తంలో అమ్మోనియం నైట్రేట్‌ ఉండటం ప్రమాదకరమని భావించిన అధికారులు.. ఓడరేవులోని ఓ గిడ్డంగిలో భద్రపర్చారు.

అణు బాంబును తలపించిన తీవ్రత 
బీరుట్‌లో పేలుడు తీవ్రత అణు బాంబును తలపించిందని స్థానికులు చెబుతున్నారు. ఆ ధ్వని 200 కిలోమీటర్ల దూరంలోని సైప్రస్‌లోనూ వినిపించిందంటేనే దీని తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. సంఘటనా స్థలానికి 9 కిలోమీటర్ల దూరంలోని విమానాశ్రయ అద్దాలు పగిలిపోయాయి. భూకంప లేఖినిపై దీని తీవ్రత 3.3గా నమోదైంది. అంటే చిన్నపాటి భూకంపంతో సమానమన్న మాట. ఇది హిరోషిమాపై వేసిన అణుబాంబులో ఐదో వంతు శక్తికి సమానమని ప్రముఖ అంగ్ల పత్రిక ‘ది సన్‌’ పేర్కొంది. పేలుడు తర్వాత అణు విస్ఫోటంలా పొగలు సుడులు తిరుగుతూ మేఘాలను కమ్మేయడం కూడా వీడియోల్లో స్పష్టంగా కనిపించింది. పేలుడు తీవ్రతకు ఓడరేవు వద్ద ఉన్న మూడు నౌకలు మునిగిపోయాయి. 

నష్టం రూ.1.12 లక్షల కోట్లకు పైమాటే 
ఇప్పటికే ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న లెబనాన్‌కు తాజా పేలుడు శరాఘాతంలా మారింది. ఈ దుర్ఘటన కారణంగా రూ.1.12 లక్షల కోట్లకుపైగా నష్టం వాటిల్లినట్లు అంచనా. దేశం నిల్వ చేసుకున్న ధాన్యంలో చాలావరకు వినియోగానికి పనికి రానంతగా పాడైపోయింది. పొరుగున ఉన్న సిరియాలో అంతర్యుద్ధమూ లెబనాన్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ఆ దేశం నుంచి ప్రజలు లెబనాన్‌కు భారీగా వలస వస్తున్నారు. ఆహారం దొరక్క స్థానికులే అవస్థలు పడుతున్నవేళ సిరియా వాసుల రాక మరింత కలవరపెడుతోంది. ఇప్పుడు కొవిడ్‌ సంక్షోభం కూడా తోడు కావడంతో లెబనాన్‌లో ఆహార ధరలు 247 శాతం వరకు పెరిగినట్లు అంచనా. ఇలాంటి పరిస్థితుల్లో గోదాముల్లోని ధాన్యమంతా మట్టిపాలు కావడంతో లెబనాన్‌ దిక్కుతోచని స్థితిలో ఉంది. తాజా పేలుడు గాయం నుంచి కోలుకునేందుకు బీరుట్‌కు కొన్ని దశాబ్దాలు పట్టొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

అధికారుల అత్యాశే కారణమా? 
లెబనాన్‌ అధికారులు జప్తు చేసిన అమ్మోనియం నైట్రేట్‌ బ్రెజిల్‌లోని ఆర్కాస్‌ నైట్రో ప్రిల్‌ అనే కంపెనీ ఉత్పత్తి చేసినదిగా తెలుస్తోంది. ఆ పదార్థం ‘నైట్రో ప్రిల్‌ హెచ్‌డీ’ తరగతికి చెందినదనీ సమాచారం. దాన్ని నిల్వ ఉంచిన సంచులపై కంపెనీ పేరు కనిపించింది. సదరు కంపెనీ క్వారీల్లోకి పేలుడు పదార్థాలను ఎక్కువగా సరఫరా చేస్తుంటుంది. అది ఉత్పత్తి చేసే పేలుడు పదార్థాన్ని ఒక్కో చోట గరిష్ఠంగా 400 టన్నుల వరకే నిల్వ చేయాలని రక్షణ రంగ నిపుణులు పలువురు చెబుతున్నారు. అలాంటిది 2,750 టన్నుల పదార్థాన్ని ఒకే చోట ఎందుకు నిల్వ చేయాల్సి వచ్చిందో అధికారులు సమాధానం చెప్పాలని వారు నిలదీస్తున్నారు. ఒకేసారి భారీ మొత్తంలో అక్రమ రవాణా పదార్థాలను పట్టుకుంటే వచ్చే నజరానాలకు అధికారులు ఆశపడి ఉండొచ్చని.. అందుకే ఒకే చోట నిల్వ చేసి లెక్కల్లో చూపించేందుకు ప్రయత్నించి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. బీరుట్‌లో ఉగ్రవాద కార్యకలాపాలూ ఎక్కువేనని వారు గుర్తుచేశారు. అలాంటి చోట భారీగా పేలుడు పదార్థాన్ని నిల్వ ఉంచడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.  


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.