మరో వలస విధానంపై ట్రంప్‌ గురి!

తాజా వార్తలు

Updated : 11/07/2020 14:51 IST

మరో వలస విధానంపై ట్రంప్‌ గురి!

ప్రతిభ ఆధారిత వలస విధానం పేరిట డీఏసీఏ నిర్వీర్యం?

వాషింగ్టన్‌: గత ప్రభుత్వాల వలస విధానాలను తొలి నుంచి వ్యతిరేకిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వాటిని సమూలంగా మార్చే దిశగా సాగుతున్నారు. ఇప్పటికే కరోనా సంక్షోభం సాకుతో పలు వలసేతర వీసాలపై నిషేధం విధించిన ఆయన తాజాగా ఒబామా సర్కార్‌ మానవతా థృక్పథంతో తెచ్చిన ‘డిఫర్డ్‌ యాక్షన్‌ ఫర్‌ చైల్డ్‌హుడ్‌ అరైవల్స్‌ ప్రోగ్రాం’(డీసీసీఏ)కు స్వస్తి పలికేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు త్వరలో  ఓ సమగ్ర వలస విధానాన్ని అమలులోకి తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. ఈ విషయంపై శుక్రవారం వైట్‌హౌస్‌ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

చిన్నతనంలోనే తల్లిదండ్రులతో వచ్చి.. చట్టవిరుద్ధంగా అమెరికాలో ఉంటున్న వారికి ప్రభుత్వపరమైన రక్షణ కల్పించేందుకు ఒబామా ప్రభుత్వం తీసుకొచ్చిన పథకమే డీఏసీఏ. దీన్ని ట్రంప్‌ తొలి నుంచి వ్యతిరేకిస్తున్నారు. దాన్ని రద్దు చేసేందుకు కార్యాచరణ ప్రారంభించారు. దీనిపై సమీక్షించిన ఆ దేశ సుప్రీం కోర్టు..  డీఏసీఏను ఉపసంహరించడానికి ట్రంప్ సర్కార్ అనుసరిస్తున్న విధానాలు సరిగా లేవంటూ తీర్పిచ్చింది.  దీంతో మరో కొత్త విధానాన్ని తీసుకురాబోతున్నట్లు.. దాంట్లో డీఏసీఏ భాగంగానే ఉండబోతుందని భావించారు. పరోక్షంగా ఆ పథకాన్ని రద్దు చేయనున్నట్లు చెప్పారు. 

‘‘ఎంతో పటిష్ఠమైన, కీలకమైన బిల్లును తీసుకురాబోతున్నాం. ప్రతిభ ఆధారిత వలస విధానం రాబోతోంది. అందులో డీఏసీఏ కూడా భాగంగా ఉంటుంది. దీంతో ప్రస్తుతం డీఏసీఏ కింద లబ్ధిపొందుతున్నవారికి పౌరసౌత్వం కల్పించడానికి ఇది బాటలు వేయనుంది. ఈ బిల్లు పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తారు’’ అని ట్రంప్‌ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.  ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే శ్వేతసౌధం తాజాగా ప్రకటన విడుదల చేసింది. స్థానికుల ఉపాధి అవకాశాల్ని కాపాడడంలో భాగంగానే ట్రంప్‌ ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొంది.  

డీఏసీఏపై చట్టపరమైన పరిష్కారం చూపే దిశగా కాంగ్రెస్‌ సభ్యులతో సంప్రదింపులు జరిపేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ ట్రంప్‌ చాలాకాలం క్రితమే ప్రకటించారని వైట్‌ హౌస్‌ గుర్తు చేసింది.  డీఏసీఏ అంశంతో పాటు సరిహద్దుల వద్ద భద్రత, శాశ్వత ప్రతిభ ఆధారిత వలస విధాన సంస్కరణలపై చర్చించేందుకు ట్రంప్‌ ముందు నుంచి ఆసక్తిగా ఉన్నారని తెలిపింది. 

అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టింది మొదలు వలస నిబంధనలపై ట్రంప్‌ కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. వలస విధానాన్ని సాకుగా చూపి అక్కడి స్థానికుల్లో తన ప్రాబల్యం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.  రెండోసారి కూడా అదే బాటలో గద్దెనెక్కాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.  దీనికి కరోనా సంక్షోభం కూడా తోడు కావడంతో ఉపాధి కోల్పోయిన వారికి మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే విదేశీ వృత్తి నిపుణులు ఉద్యోగాలు చేసుకోవడానికి వీలు కల్పించే హెచ్‌–1బీ, హెచ్‌–2బీ, ఎల్‌1, ఎల్‌2 వీసాలను ఈ ఏడాది డిసెంబరు వరకు నిషేధించారు. గ్రీన్‌కార్డుల జారీని కూడా నిలిపివేశారు. ఇటీవల ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించే విశ్వవిద్యాలయాల్లోని విదేశీ విద్యార్థులు దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు.  తాజాగా డీఏసీఏని కూడా నిర్వీర్యం చేసేందుకు సిద్ధమయ్యారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని