కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఉచితంగా ఇవ్వండి: నోబెల్‌ విన్నపం

తాజా వార్తలు

Published : 29/06/2020 10:54 IST

కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఉచితంగా ఇవ్వండి: నోబెల్‌ విన్నపం

ఢాకా: మార్చి 11న కరోనా వైరస్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ మహమ్మారిగా ప్రకటించింది. కాగా, ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా కోటిమంది దీని బారిన పడ్డారు. ఐదు లక్షలకు పైబడి మరణాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను అత్యవసర వస్తువుగా పరిగణించి, ఉచితంగా అందించాలని.. 18 మంది నోబెల్‌ గ్రహీతలతో సహా వంద మంది ప్రముఖులు విజ్ఞప్తి చేశారు. వీరిలో అంతర్జాతీయ సంస్థలు, మాజీ దేశాధ్యక్షులు, ప్రముఖ రాజకీయ నేతలు, ప్రపంచ ప్రసిద్ధ కళాకారులు ఉన్నారు. కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ఏకం కావాల్సిందిగా ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌, ప్రపంచ ఆరోగ్య సంస్థ, మతాధికారులు, కార్పొరేషన్లు, మీడియా సంస్థలకు వారు పిలుపు నిచ్చారు.

‘‘కరోనా మహమ్మారి ప్రతిదేశ ఆరోగ్యరంగంలో ఉన్న బలాలను, బలహీనతలను బహిర్గతం చేసింది. ప్రజలకు ఆరోగ్య సదుపాయాలు అందించటంలోని అవరోధాలను, అసమానతలను ఇది తేటతెల్లం చేసింది. ఇక రానున్న కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ఎంత విజయవంతం కాగలదనేది.. అది ఎంతమేరకు అందరికీ అందుబాటులో ఉంటుందనే విషయంపై ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో.. కరోనా వ్యాక్సిన్‌ ఉత్తత్తికి, ప్రపంచవ్యాప్త ఉచిత సరఫరాకు ముందుకు రావాల్సిందిగా ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలు, దాతలు, సేవాసంస్థలను కోరుతున్నాం. నిస్సహాయులైన ప్రజలను ఏ విధమైన భేదభావం లేకుండా ఆదుకోవడం.. అన్ని సామాజిక, రాజకీయ, ఆరోగ్య సంస్థలతో సహా మనందరి సామూహిక బాధ్యతగా గుర్తించాలి’’ అని ఆ విజ్ఞాపనలో పేర్కొన్నారు.

బంగ్లాదేశ్‌కు చెందిన నోబెల్‌ స్వీకర్త మొహమ్మద్‌ యూనస్‌ స్థాపించిన ఓ స్వచ్ఛంద సంస్థ ఈ మేరకు ఓ లేఖను విడుదల చేసింది. ఈ ఆలోచనకు మద్దతు తెలుపుతూ నోబెల్‌ గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్‌, రష్యా మాజీ అధ్యక్షుడు మైఖేల్‌ గొర్బచెవ్‌, హాలీవుడ్ నటుడు జార్జి క్లూని, దక్షణాఫ్రికాకు చెందిన మతబోధకుడు ఆర్చ్‌ బిషప్‌ డెస్మండ్‌ టుటు తదితరులు సంతకాలు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని