భారతీయ ఉద్యోగుల పట్ల సౌదీ కంపెనీ ఉదారం

తాజా వార్తలు

Published : 10/06/2020 12:03 IST

భారతీయ ఉద్యోగుల పట్ల సౌదీ కంపెనీ ఉదారం

కొచ్చి: తమ వద్ద పనిచేస్తోన్న భారతీయులను స్వదేశానికి తరలించడానికి సొంత ఖర్చుతో విమానాలు ఏర్పాటు చేసింది సౌదీ అరేబియాకు చెందిన ఓ కంపెనీ. కరోనా కారణంగా విదేశీ ప్రయాణాల మీద ఆంక్షలు విధించడంతో భారతీయులు వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గల్ఫ్‌ దేశమైన సౌదీ అరేబియాలో చిక్కుకుపోయిన 1600మందికి పైగా భారతీయ ఉద్యోగులను తరలించడానికి తొమ్మిది విమానాలను ఏర్పాటు చేసినట్లు ఎక్స్‌పర్టైజ్‌ కాంట్రాక్టింగ్ కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇందులో భాగంగా ఇప్పటికే జూన్‌ 5,6,7 తేదీల్లో చెన్నై, హైదరాబాద్‌, దిల్లీ, అహ్మదాబాద్‌కు కొన్ని విమానాలు చేరుకున్నాయని.. జూన్‌ 11తో ఈ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపింది. పెట్రోకెమికల్, భారీపరికరాల రంగాల్లో  10వేల మంది ఉద్యోగులతో ఈ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

మధ్య ప్రాచ్యంలో ఈ తరలింపు ప్రక్రియను చేపట్టిన అతిపెద్ద ప్రైవేటు సంస్థ తమదేనని కంపెనీ డైరెక్టర్ కేఎస్‌ షేక్ తెలిపారు. భారత్‌తో పాటు ఉప ఖండానికి చెందిన తమ ఉద్యోగులను స్వదేశాలకు చేర్చడానికి మొత్తంగా 12 విమానాలు ఏర్పాటు చేశామని , దానికింద సుమారు 2000 మందిని తరలించనున్నట్లు ఆయన చెప్పారు. అలాగే విమాన ప్రయాణం, క్వారంటైన్ సహా సంబంధిత ఖర్చులన్నీ సంస్థే భరిస్తుందని వెల్లడించారు. అంతేకాకుండా వైరస్ తీవ్రత తగ్గిన తర్వాత కంపెనీ అవసరాలను బట్టి ఉద్యోగులను ఉచితంగా వెనక్కి తీసుకువస్తామని వివరించారు. ఈ తరలింపు కోసం 30 రోజుల పాటు సంబంధిత దేశాలతో సంప్రదింపులు జరిపామన్నారు. షెడ్యూల్ ప్రకారం జూన్‌ 10న కొచ్చి, జూన్ 11న మంగళూరుకు మిగిలిన విమానాలు చేరుకుంటాయని తెలిపారు. అవసరమైతే మరికొన్ని విమానాలు నడపడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కాగా, ఇప్పటికే భారత ప్రభుత్వం ‘వందేభారత్ మిషన్‌’ కింద విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకువస్తోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని