దిల్లీలో..జులై చివరినాటికి 5.5లక్షల కేసులు!

తాజా వార్తలు

Published : 09/06/2020 16:21 IST

దిల్లీలో..జులై చివరినాటికి 5.5లక్షల కేసులు!

అంచనా వేసిన దిల్లీ ప్రభుత్వం

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. దేశ రాజధాని దిల్లీ వైరస్‌ తీవ్రత ఆందోళనకరంగా మారింది. ఈ సమయంలో దిల్లీలో జులై చివరి నాటికి దాదాపు 5.5లక్షల పాజిటివ్‌ కేసులు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నామని దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా వెల్లడించారు. ఆ సమయానికి ఆసుపత్రుల్లో 80వేల పడకలు అవసరమవుతాయని అన్నారు. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల తీరును పరిగణలోకి తీసుకొని జూన్‌ చివరకు లక్షకు చేరుకునే అవకాశం ఉందని అంచానా వేశారు. ప్రస్తుతం కేసుల సంఖ్య రెట్టింపు కావడానికి 12నుంచి 13రోజుల సమయం పడుతుందన్నారు. దేశ రాజధానిలో కరోనా వైరస్‌ తీవ్రతపై లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ నిర్వహించిన సమీక్షా సమావేశం అనంతరం మనీష్‌ సిసోడియా ఈ వివరాలు వెల్లడించారు.

అయితే, ప్రస్తుతం దిల్లీలో కరోనా తీవ్రత ఎక్కువగానే ఉన్నప్పటికీ సమూహవ్యాప్తి దశలో లేదని కేంద్ర ప్రభుత్వ అధికారులు తెలిపారని సిసోడియా పేర్కొన్నారు. దిల్లీ విపత్తు నిర్వహణ విభాగానికి చైర్మన్‌గా ఉన్న రాష్ట్ర లెఫ్టెనెంట్‌ గవర్నర్‌ నేతృత్వంలో అన్నిరాజకీయ పక్షాలతో ఈ సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ అధికారులు కూడా పాల్గొన్న ఈ సమావేశంలో దిల్లీలో సమూహ వ్యాప్తి లేదని స్పష్టం చేసినట్లు సిసోడియా విలేకరులకు తెలియజేశారు. దిల్లీలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుత్రుల్లోని పడకలు దిల్లీవాసులకే కేటాయించే విషయం పునఃపరిశీలించాలని చేసిన రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని ఎల్‌జీ మరోసారి తోసిపుచ్చినట్లు దిల్లీ ఉపముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రాంతాలతో సంబంధం లేకుండా రోగులకు చికిత్స చేయాలని లెఫ్టెనెంట్‌ గవర్నర్‌ అధికారులను ఆదేశించారు.

ఇక అస్వస్థతకు గురైన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఈ రోజు కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. పరీక్ష నివేదిక రేపు వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, జూన్‌ 9నాటికి దిల్లీలో 29,943వేల పాజిటివ్‌ కేసులు నమోదుకాగా వీరిలో 874 మంది మృత్యువాతపడ్డట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని