అమెరికా ఘటనలపై స్పందించిన పోప్‌

తాజా వార్తలు

Published : 03/06/2020 22:44 IST

అమెరికా ఘటనలపై స్పందించిన పోప్‌

వాటికన్‌ సిటీ: ఆఫ్రికన్‌ అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ మృతి, దాని పర్యవసానంగా అమెరికాలో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులను గురించి క్రైస్తవ మత గురువు పోప్‌ ఎట్టకేలకు పెదవి విప్పారు. ‘ఐ కాంట్‌ బ్రీత్‌’ అనే జార్జ్‌ ఆఖరి మాటలే నినాదంగా లక్షలాది అమెరికన్లు రోడ్లెక్కారు. దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు భగ్గుమనటంతో అధ్యక్షుడు ట్రంప్‌, కుటుంబంతో సహా బంకర్‌లో కొంత సేపు గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. వర్ణవివక్ష సహించలేని పాపమని తాజా ఘటనను పోప్‌ ఖండించారు. అందరూ సంయమనం పాటించాల్సిందిగా అమెరికన్లకు పిలుపునిచ్చారు.

పోలీసు అధికారి ఒకరు మోకాలితో జార్జ్‌ ఫ్లాయిడ్‌ మెడపై అదిమి పెట్టడంతో అతడు నడిరోడ్డు మీద ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన జాత్యహంకారం కారణంగా జరిగిందంటూ అమెరికాలో గత ఎనిమిది రోజులుగా నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పోప్‌ నేడు స్పందిస్తూ... జార్జ్‌ మృతి విచారకరమని, జాత్యహంకారానికి బలైన అతని కోసం తాను ప్రార్థిస్తున్నానన్నారు. ఈ వారమంతా తాను చేసే ప్రవచనాలను, ఆయన అమెరికా విషాద ఘటనకు అంకింతం చేశారు. అయితే ప్రస్తుత సామాజిక అశాంతి తనను అమితంగా బాధపెడుతోందని... వీధుల్లో చెలరేగుతున్న హింస స్వీయ నాశనానికి, ఓటమికి దారితీస్తుందన్నారు. వర్ణ వివక్ష ఏ రూపంలో ఉన్నా సహించేది లేదని...  మనిషి జీవితాన్ని, దాని పవిత్రతను కాపాడేందుకు అన్ని విధాల ప్రయత్నం చేద్దామని పోప్‌ ఫ్రాన్సిస్‌ పిలుపునిచ్చారు. హింస వల్ల లభించేది ఏమీ లేకపోగా... ఎంతో కోల్పోవాల్సి వస్తుందని అయన హితవు చెప్పారు. శాంతి కోసం భగవంతుని ప్రార్థించాలని ఆయన సూచించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని