ఇది ‘ట్రంప్‌ డెత్‌ క్లాక్‌’

తాజా వార్తలు

Updated : 12/05/2020 12:09 IST

ఇది ‘ట్రంప్‌ డెత్‌ క్లాక్‌’


న్యూయార్క్: కరోనా వైరస్‌ తీవ్రత గురించి హెచ్చరించినప్పటికీ చెవికెక్కించుకోలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఇప్పటికే విమర్శల పాలైన సంగతి తెలిసిందే. తాజాగా న్యూయార్క్‌ నగరంలోని ప్రఖ్యాత టైమ్స్‌ స్క్వేర్‌ వేదికగా ఇలాంటి వ్యాఖ్యలే వినిపించాయి. ప్రస్తుతం ఖాళీగా ఉన్న దాని మీద ‘ట్రంప్‌ డెత్‌ క్లాక్‌’ పేరుతో ఒక బిల్‌ బోర్డు వెలిసింది. ట్రంప్ తగిన సమయంలో చర్యలు తీసుకొని ఉంటే ఆపగలిగే మరణాల సంఖ్యను దాని మీద ప్రదర్శించారు. ఆ బిల్‌బోర్డు సృష్టికర్త న్యూయార్క్‌కు చెందిన సినీనిర్మాత యూజీన్‌ జారెకి.

కరోనా వైరస్ కారణంగా ఇప్పటి వరకు అమెరికాలో 80వేలకు పైగా మరణాలు సంభవించాయి. అయితే ట్రంప్‌ యంత్రాంగం సరైన సమయంలో స్పందించి ఉంటే 48,000 పైగా మరణాలను అరికట్టగలిగేవాళ్లమని యూజీన్ విమర్శించారు. మార్చి 16న కాకుండా మార్చి 9 నుంచే సామాజిక దూరం, పాఠశాలల మూసివేత వంటి కఠిన నిబంధనలు అమలు చేసి ఉంటే ఆ మరణాలు సంభవించేవే కాదని ఆ డెత్ క్లాక్‌లో ఆయన పేర్కొన్నారు. ప్రముఖ అంటువ్యాధుల నివారణ నిపుణుడు ఆంటోనీ ఫౌచీ వ్యాఖ్యలను అనుసరించి నిపుణులు వేసిన లెక్కల ఆధారంగా అరికట్టగల మరణాలు 60 శాతంగా ఉన్నాయన్నారు. గతంలో ఫౌచీ మాట్లాడుతూ...ముందుగానే నిబంధనలను అమలు చేసుంటే, మరింత మందిని కాపాడగలిగేవాళ్లమని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలో సంక్షోభాన్ని ఎదుర్కోడానికి మరింత సమర్థవంతమైన నాయకత్వాన్ని కోరుకుంటున్నామని ఆ నిర్మాత క్లాక్‌ మీద రాసుకొచ్చాడు. ‘యుద్ధంలో చనిపోయిన సైనికుల సేవలకు గుర్తుగా పేర్లను స్మారకాల మీద రాసినట్లుగా, ట్రంప్‌ యంత్రాంగం ఆలస్యంగా స్పందించినందుకు కోల్పోయిన ప్రాణాల సంఖ్యను ప్రజలకు వెల్లడించడం ఇప్పుడు అత్యవసరం’ అని ఆ బోర్డు మీద ప్రస్తావించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని