లాక్‌డౌన్‌‌తో గంగానది మరింత పవిత్రం!

తాజా వార్తలు

Published : 13/04/2020 21:10 IST

లాక్‌డౌన్‌‌తో గంగానది మరింత పవిత్రం!

వారణాసి: భారత్‌లో లాక్‌డౌన్‌ అమలవుతున్న కారణంగా పర్యావరణంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా వాహనాలు, పరిశ్రమలు మూతపడడంతో కాలుష్య తీవ్రత భారీ స్థాయిలో తగ్గింది. తాజాగా వారణాసి, హరిద్వార్‌లలో ప్రవహించే గంగానదిలో నీరు ప్రస్తుతం స్వచ్ఛంగా ఉన్నట్లు పర్యావరణవేత్తలు, నిపుణులు గుర్తించారు. పట్టణానికి సమీపప్రాంతంలో ఉండే భారీ పరిశ్రమలు మూతపడడంతో గంగానది జలాలు గతంతోపోలిస్తే 40నుంచి 50శాతం శుద్ధిగా మారాయని తాజాగా ఐఐటీ-భువనేశ్వర్‌కు చెందిన ఓ ప్రొఫెసర్‌ వెల్లడించారు. అంతేకాకుండా వారణాసిలోని పలు హోటళ్లు మూసివేయడంతోపాటు నదిలోకి వచ్చే వ్యర్థపదార్థాలు పూర్తిగా కనుమరుగయ్యాయి. దీంతో కాలుష్యం తగ్గడమే కాకుండా ప్రస్తుతం నీరు తాగడానికి కూడా పనికొచ్చేవిధంగా మారాయని పర్యావరణ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇంత గణనీయమార్పు కనిపించడం గడచిన కొన్ని దశాబ్దాల్లో ఇదే తొలిసారని అంటున్నారు.

కేవలం గంగానది కాకుండా దిల్లీ సమీపంలో ప్రవహించే యమునా నది నీటి స్వచ్ఛతలో కూడా మార్పు వచ్చినట్లు ఇప్పటికే అధికారులు గుర్తించారు. లాక్‌డౌన్‌తో పాటు ఈమధ్యే కురిసిన వర్షాలు గంగా, యమున నదుల్లో నీరు స్వచ్ఛంగా మారడానికి దోహదం చేశాయని పర్యావరణవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే, గంగానది నీరు తాగడానికే కాదు, కనీసం స్నానం చేయడానికి కూడా పనికిరావని గత సంవత్సరం కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే, లాక్‌డౌన్‌ కాలంలో ఆయా రాష్ట్ర కాలుష్యనియంత్రణ మండళ్లు నదుల్లో కాలుష్య తీవ్రత, నీటి నాణ్యతపై పరిశోధనల్లో నిమగ్నమయ్యాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని