మోదీ గ్రేట్: ట్రంప్‌

తాజా వార్తలు

Published : 08/04/2020 23:20 IST

మోదీ గ్రేట్: ట్రంప్‌

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మాటతీరు గురించి తెలియనివాళ్లుండరు. లెక్కలేనితనంగా మాట్లాడినట్లే మాట్లాడి, అంతలోనే ప్రశంసలు కురిపిస్తారు. తాజాగా భారత్ విషయంలో కూడా ఆయన అలానే ప్రవర్తించారు. ఆయన వైఖరి మనదేశంలో విపక్షాలకు సైతం తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. దీనంతటికి కారణం హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ఔషధాలే. 
అమెరికాను గడగడలాడిస్తోన్న కొవిడ్ 19 చికిత్స నిమిత్తం హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలు కావాలంటూ ట్రంప్‌ భారత్‌ను కోరారు. వాటిని తమకు అందించకపోతే భారత్‌ మీద ప్రతీకారం ఉండొచ్చని నోరుపారేసుకున్నారు. అయితే మనదేశం వాటిని సరఫరా చేయడానికి ముందుకు రాగానే ప్రధాని మోదీని ప్రశంసించడం మొదలు పెట్టారు. మోదీ గొప్పవారు, మంచివారు అని అభినందిస్తున్నారు. ఇప్పటికే గుజరాత్‌లోని కొన్ని పరిశ్రమల నుంచి షిప్‌మెంట్ ప్రారంభమైందని ట్రంప్‌ వెల్లడించినట్లు ఓ వార్తా ఏజెన్సీ ధ్రువీకరించింది. 
ఈ ఔషధాల సరఫరాపై  ట్రంప్‌ మీడియాతో మాట్లాడుతూ..‘ ఆయన గొప్పవారు. చాలా మంచివారు’ అని వెల్లడించారు.  కరోనా వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌కు టీకా, ఔషధం లేకపోవడంతో హైడ్రాక్సీక్లోరోక్విన్‌పై ట్రంప్‌ ఆశలు పెట్టుకున్నారు. ఈ ఔషధాన్ని మలేరియాకు చికిత్స చేసేందుకు ఉపయోగిస్తున్నారు. కొవిడ్‌-19 రోగులకు ఇతర ఔషధాలతో కలిపి హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను కూడా ఇవ్వాలని అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) సూచించింది. కరోనా రోగులు, అనుమానితులకు చికిత్స చేస్తున్న సిబ్బందికి, రోగుల దగ్గరగా వచ్చిన బంధువులకు ఈ మందును ఇవ్వాలని భారత వైద్య పరిశోధన మండలి కూడా సూచించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని