తల్లి మరణం, 654కి.మీ నడక ప్రారంభం!

తాజా వార్తలు

Published : 29/03/2020 01:04 IST

తల్లి మరణం, 654కి.మీ నడక ప్రారంభం!

రాయ్‌పూర్‌: కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా దేశంలో విధించిన 21రోజుల లాక్‌డౌన్‌ సత్ఫలితాలిస్తున్నప్పటికీ కొందరికి మాత్రం చేదు అనుభవాన్ని మిగులుస్తోంది. తాజాగా ఇలాంటి ఘటనే ఛత్తీస్‌గఢ్‌లో చోటుచేసుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసికి చెందిన మురకీం అనే ఓ 25ఏళ్ల యువకుడు రాయ్‌పూర్‌లో పనిచేస్తున్నాడు. తాజాగా ఈ నెల 25న తన తల్లి మరణించిందనే వార్త తెలిసింది. అప్పటికే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. దీంతో రాయ్‌పూర్‌ నుంచి స్వస్థలం వారణాసికి కాలినడకన వెళ్లడానికి సిద్ధమయ్యాడు. రాయ్‌పూర్‌ నుంచి దాదాపు 654కి.మీ దూరం ఉన్న వారణాసికి తన ఇద్దరు మిత్రులతో కలిసి బయలుదేరాడు. దారిలో అక్కడక్కడ రోడ్డుపై వెళ్లే వాహనాల సహాయాన్ని(లిఫ్ట్‌) తీసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇలా మూడు రోజుల ప్రయాణ అనంతరం 350కి.మీ దూరంలోని బైకుంఠపూర్‌ చేరుకున్నారు. మార్గమధ్యంలో ఉన్న వీరిని మీడియా పలుకరించగా ఈ విషయాలను వెల్లడించారు. ఇప్పటికే సగం దూరం చేరుకున్నామని..ఇలాగే నడుస్తూ తమ స్వస్థలానికి వెళ్తామని అన్నారు. 

లాక్‌డౌన్‌ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఫ్యాక్టరీలు, కార్యాలయాలతో పాటు దుకాణాలు మూతపడ్డాయి. దీంతో వీటిలో పనిచేసే పలువురు కార్మికులు, కూలీలు కాలినడకన తమ సొంత ఊళ్లకు పయనమయ్యారు. వేల సంఖ్యలో ప్రజలు వందల కి.మీ దూరంలో ఉన్న స్వగ్రామాలకు కాలినడకన తరలివెళ్లడం కలచివేస్తోంది. అధికారులు ఎక్కడి ప్రజలు అక్కడే ఉండాలని సూచిస్తున్నప్పటికీ వీరు ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ముఖ్యంగా మహానగరాలనుంచి తరలిపోతున్న పరిస్థితులు అధికంగా ఉన్నాయి. తాజాగా దిల్లీ నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌ వెళ్లే వారికోసం ఏకంగా వెయ్యి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది యూపీ ప్రభుత్వం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని