ఆ అంశంపై మోదీతో చర్చించలేదు: ట్రంప్‌

తాజా వార్తలు

Published : 26/02/2020 01:24 IST

ఆ అంశంపై మోదీతో చర్చించలేదు: ట్రంప్‌

దిల్లీ: భారత్‌లో తన రెండు రోజుల పర్యటన మధురానుభూతిని కలిగించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. మంగళవారం సాయంత్రం ఆయన దిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక బంధాలపై మీడియా ప్రతినిధులు అడిగిన పలు  ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. భారత్‌ అద్భుతమైన దేశమనీ.. ప్రధాని మోదీతో బలమైన మైత్రి ఏర్పడిందన్నారు. భారత కంపెనీల సీఈవోలతో సమావేశం సంతృప్తికరంగా సాగిందని చెప్పారు. బిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టే సమర్థులు భారత్‌లో ఉన్నారన్నారు. అఫ్గాన్‌లో శాంతి నెలకొనాలనేదే తమ ప్రయత్నమని ట్రంప్‌ చెప్పారు. అక్కడ 19 ఏళ్లుగా శాంతి స్థాపన కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. ఉగ్రవాదంపై పోరాడుతున్నామే తప్ప అమాయకుల్ని లక్ష్యంగా చేసుకోవడంలేదని అగ్రరాజ్యాధిపతి స్పష్టంచేశారు. అఫ్గాన్‌లో శాంతి నెలకొనాలని భారత్‌ కూడా కోరుకుంటోందని ట్రంప్‌ గుర్తు చేశారు. ఉగ్రవాదంపై పోరాటంలో తాను చేసినంత కృషి మరెవరూ చేయలేదని ఆయన వ్యాఖ్యానించారు. అఫ్గానిస్థాన్‌, ఇరాన్‌లో తమ బలగాలను తగ్గిస్తున్నామని చెప్పారు. 

మత స్వేచ్ఛ ఉండాలని మోదీ కోరుకుంటున్నారు

వేలాది మంది అమాయకులను ఐసిస్‌ ఉగ్రవాద సంస్థ బలితీసుకుందని ట్రంప్‌ ఆందోళన వ్యక్తంచేశారు. అలాంటి ఐసిస్‌ను తుదముట్టించే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. అల్‌ బగ్దాదీ, సులేమానీ, హమ్జద్‌ లాడెన్‌ చనిపోయారన్నారు. భారత్‌లో మత స్వేచ్ఛ పరిరక్షణకు మోదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తోందన్నారు. ప్రజలందరికీ మత స్వేచ్ఛ ఉండాలని మోదీ కోరుకుంటున్నారనీ.. ఇవాళ్టి మాటామంతిలోనూ మోదీ దాని గురించి ప్రస్తావించారని వెల్లడించారు. ‘గతంలో ఈ దేశంలో ముస్లింలు 14 కోట్లమంది ఉండేవాళ్లు.. ప్రస్తుతం ఆ సంఖ్య 20 కోట్లు దాటిందని మోదీ నాతో చెప్పారు. ముస్లింలకు స్వేచ్ఛ, రక్షణ ఉందనేందుకు ఇదే నిదర్శనమని చెప్పారు. భారత్‌ భవిష్యత్తులో ఆర్థికంగా సామాజికంగా మరింత పురోగమిస్తుంది. నైపుణ్యాలు అందిపుచ్చుకొనేందుకు భారత యువత ఎంతో కృషిచేస్తున్నారు. వచ్చే 50 ఏళ్లలో భారత్‌ దిగ్గజంగా నిలుస్తుంది’’  భారత్‌లో జరుగుతున్న కొన్ని ఘటనలు ఈ దేశ అంతర్గతమని.. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) గురించి ప్రధాని మోదీతో తాను చర్చించలేదని ట్రంప్‌ స్పష్టంచేశారు. 

అది భారత్‌ అంతర్గత విషయం..

కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దుపై మాట్లాడేందుకు ఏమీ లేదనీ.. అది భారత్‌ అంతర్గత విషయమని ట్రంప్‌ అభిప్రాయపడ్డారు. ‘‘పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. పాక్‌ నుంచి ఉగ్ర ముప్పుపై మోదీ తగిన జాగ్రత్తలు తీసుకోగలరు. మోదీ దృఢమైన వ్యక్తి.. కశ్మీర్‌ అంశాన్ని ఆయన చూసుకోగలరు. మోదీ మాటల్లోనే కాదు.. చేతల్లోనూ దృఢంగా ఉంటారు. భారత్‌ పాకిస్థాన్‌ మధ్య కొన్ని అంశాలు అపరిష్కృతంగా ఉన్నాయి. ఇరు దేశాలు కోరుకుంటే మధ్యవర్తిత్వానికి సిద్ధమని గతంలోనే చెప్పాను. కశ్మీర్‌ వివాదంలో చాలా సంక్లిష్టమైన అంశాలు ఉన్నాయి. ప్రతి కథకు రెండు పార్శ్వాలు ఉంటాయి’’ అని ట్రంప్‌ వివరించారు.

వాణిజ్య లోటులో సానుకూలంగా ఉండాలి

భారత్‌తో వాణిజ్య ఒప్పందాల విషయంలో చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్టు ట్రంప్‌ తెలిపారు. ‘‘భారత్‌ నుంచి అమెరికాకు ఎగుమతి చేస్తున్న ద్విచక్రవాహనాలపై అదనపు సుంకాలు లేవు. అమెరికా నుంచి దిగుమతి చేసుకొనే ద్విచక్రవాహనాలపై భారీగా పన్ను వేస్తున్నారు. అమెరికాతో భారత్‌ వాణిజ్య లోటు 30 బిలియన్‌ డాలర్లు ఉంది. కొంత కాలంగా అది 24 బిలియన్‌ డాలర్లకు తగ్గింది. భారత్‌ మంచి మిత్ర దేశమే.. కానీ వాణిజ్య లోటులో సానుకూలంగా ఉండాలని కోరుతున్నా. ఇంధన రంగంలో ఇరుదేశాల మైత్రి మరింత విస్తరిస్తోంది’’ అని ట్రంప్‌ చెప్పారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని