ట్రంప్‌ పర్యటనపై విదేశీ మీడియా ఏమందంటే..

తాజా వార్తలు

Updated : 25/02/2020 12:50 IST

ట్రంప్‌ పర్యటనపై విదేశీ మీడియా ఏమందంటే..

దిల్లీ: రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఇక్కడ భారీ స్వాగతం లభించింది. సబర్మతి ఆశ్రమ సందర్శన, నమస్తే ట్రంప్‌ కార్యక్రమంలో అద్భుతమైన ప్రసంగం, తాజ్‌మహల్‌ అందాల వీక్షణతో ట్రంప్‌ తొలిరోజు పర్యటన సాగింది. విదేశీ విధానంలో తనదైన శైలిలో దూసుకెళ్తున్న ట్రంప్‌ భారత్‌తో ఎలా వ్యవహరించనున్నారన్న దానిపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అలాగే వాణిజ్య ఒప్పందం ఖరారుపై నెలకొన్న సందిగ్ధత నేపథ్యంలో అంతర్జాతీయ మీడియా ట్రంప్‌ పర్యటనపై ఆసక్తి కనబరించింది..

ట్రంప్‌ హర్షించారు: సీఎన్‌ఎన్‌

భారీ జన సందోహం మధ్య ఆత్మీయ ఆలింగనంతో ట్రంప్‌కు భారత ప్రధాని మోదీ స్వాగతం పలికారని ‘సీఎన్‌ఎన్‌ ఇంటర్నేషనల్‌’ పేర్కొంది. హంగు ఆర్భాటాలను ఇష్టపడే ట్రంప్‌ భారత్‌లో లభించిన స్వాగతానికి హర్షించారని రాసుకొచ్చింది. భారీ ఏర్పాట్లతో ఇరు దేశాల మధ్య ఉన్న బంధాన్ని ప్రపంచానికి చాటేందుకు ప్రయత్నించారని అభిప్రాయపడింది. ట్రంప్‌ ప్రసంగంలో దొర్లిన ఉచ్చారణ దోషాలను కూడా ప్రస్తావించింది. 

భారత్‌ను అమెరికా ప్రేమిస్తోంది: న్యూయార్క్‌ టైమ్స్‌

‘భారత్‌ను అమెరికా ప్రేమిస్తోంది’ అనే శీర్షికతో అమెరికాకు చెందిన ప్రముఖ పత్రికల్లో ఒకటైన ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ కథనం ప్రచురించింది. భారీ బ్యానర్లు, ఫ్లెక్సీలు మధ్య వేలాది మంది ప్రజలు అధ్యక్షుడికి స్వాగతం పలికారని రాశారు. ‘‘భారత్‌లో మోదీపై వస్తున్న విమర్శల్ని పెద్దగా ప్రస్తావించని ట్రంప్‌.. గత కొన్నేళ్లుగా పేదరిక నిర్మూలన, అభివృద్ధిని పరుగులు పెట్టించడం కోసం ప్రధాని చేస్తున్న కృషిని కొనియాడారు’’ అని అభిప్రాయపడింది.

గొప్ప అవకాశం: ది గార్డియన్‌
ఈ పర్యటన ఇరుదేశాల మధ్య ఉన్న మైత్రిని చాటుకునేందుకు గొప్ప అవకాశంగా ప్రముఖ పత్రిక ‘ది గార్డియన్’ అభివర్ణించింది. ప్రధాన వాణిజ్య ఒప్పందం ప్రస్తుతానికి నిలిచిపోయినప్పటికీ.. ఇతర ప్రముఖ ఒప్పందాలు కుదరనున్నాయని ప్రస్తావించింది. ఇక ‘నమస్తే ట్రంప్‌’ కార్యక్రమాన్ని ఇరు దేశాధినేతలు ఒకరిపై ఒకరు ప్రశంసల వర్షం కురిపించుకునేందుకు అవకాశంగా ఉపయోగించుకున్నారని రాసుకొచ్చింది.

ట్రంప్‌ తడబడ్డారు: బీబీసీ
ట్రంప్‌ పూర్తి పర్యటనను కవర్‌ చేసిన బీబీసీ ఆయన రాక సందర్భంగా చేసిన ఏర్పాట్లు, లభించిన ఘన స్వాగతాన్ని ప్రధానంగా ప్రస్తావించింది. కొంతమంది ప్రముఖ భారతీయుల పేర్లను ప్రస్తావించడంలో ట్రంప్‌ తడబడ్డట్లు బీబీసీ పేర్కొంది. అలాగే అధ్యక్షుడి పర్యటన పట్ల భారతీయుల్లో తీవ్ర ఆసక్తి కనబడిందని తెలిపింది.
వక్రబుద్ధి వీడని పాక్‌ మీడియా.. 

ఇక పాక్‌ మీడియా ఎప్పటిలాగే తమ వక్రబుద్ధిని చాటుకొంది. తమ భూభాగంపై ఉన్న ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు కృషి చేయాలని ట్రంప్‌ ఇచ్చిన సందేశాన్ని విస్మరించిన అక్కడి మీడియా.. పాక్‌తోనూ మంచి సంబంధాలు కొనసాగుతున్నాయన్న ట్రంప్ దౌత్యపరమైన వ్యాఖ్యల్ని మాత్రమే ప్రస్తావించింది. ప్రసంగంలో భాగంగా అమెరికా-పాక్‌ మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయని ట్రంప్‌ పేర్కొన్న విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని