‘ట్రంపేమైనా రాముడా..ఎందుకంత ఖర్చు’

తాజా వార్తలు

Published : 24/02/2020 11:37 IST

‘ట్రంపేమైనా రాముడా..ఎందుకంత ఖర్చు’

మోదీని ప్రశ్నించిన అధిర్‌ రంజన్‌

ముర్షీదాబాద్‌(పశ్చిమబంగాల్‌): అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పర్యటనపై కాంగ్రెస్‌ లోక్‌సభాపక్షనేత అధిర్‌ రంజన్ చౌధురి పలు విమర్శలు గుప్పించారు. ట్రంప్‌ తన ఎన్నికల ప్రచారం కోసం భారత గడ్డను ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. ఈ పర్యటన వల్ల భారత్‌కు ఏం ప్రయోజనం కలుగుతుందన్న దానిపై ఎవరికీ స్పష్టత లేదన్నారు. కేవలం ట్రంప్‌ని సంతోషపరచడం కోసమే ప్రధాని మోదీ కోట్ల రూపాయల్ని ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. అమెరికా అధ్యక్షుడు రాముడేమీ కాదని.. ఆయన కోసం అంత వెచ్చించడం దేనికని ప్రశ్నించారు. అమెరికాలో అనేక మంది గుజరాతీలు స్థిరపడ్డారని.. వారి ఓట్లను ఆకర్షించడానికే ట్రంప్‌ ఈ పర్యటన చేపట్టారని ఆరోపించారు. గతంలో వచ్చిన అధ్యక్షులు ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని కలిసేవారని.. ఈ సారి అలాంటి ఏర్పాట్లేమీ లేకపోవడాన్ని తప్పుబట్టారు. 

ట్రంప్‌ గౌరవార్థం రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఇవ్వబోయే విందుకు పలువురు నాయకుల్ని ముఖ్యమంత్రుల్ని ఆహ్వానించిన విషయం తెలిసిందే. దీనికి అధిర్‌ రంజన్‌ చౌధురికి కూడా ఆహ్వానం అందింది. అయితే దీనికి తాను హాజరు కాబోనని అధిర్‌ రంజన్‌ స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని ఆహ్వానించకపోవడమే అందుకు కారణమన్నారు.

రెండు రోజుల పర్యటన నిమిత్తం ట్రంప్‌ నేడు భారత్‌కు రానున్న విషయం తెలిసిందే. ఆయనతో పాటు సతీమణి మెలనియా, కూతరు-అల్లుడు ఇవాంకా ట్రంప్‌, జేర్డ్‌ కుష్నర్‌ సహా పలువురు ఉన్నతాధికారులు పర్యటన బృందంలో ఉన్నారు. నేడు ఉదయం 11.40గంటలకు అహ్మదాబాద్‌ విమానాశ్రయానికి చేరకోనున్న ట్రంప్‌ రేపు రాత్రి 10 గంటలకు తిరుగుపయనమవుతారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని