బ్రిటిష్‌ ఎంపీ వీసా రద్దు అందుకే.. 

తాజా వార్తలు

Published : 19/02/2020 00:55 IST

బ్రిటిష్‌ ఎంపీ వీసా రద్దు అందుకే.. 

ప్రభుత్వ వర్గాల వెల్లడి

దిల్లీ: భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందు వల్లే బ్రిటన్‌ లేబర్‌ పార్టీ పార్లమెంట్‌ సభ్యురాలు డెబీ అబ్రహాంకు భారత వీసా రద్దు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు మంగళవారం వెల్లడించాయి. రద్దుపై ఫిబ్రవరి 14నే ఆమెకు సమాచారమిచ్చినట్లు పేర్కొన్నాయి. ‘ఓ వ్యక్తికి వీసా ఇవ్వడం, తిరస్కరించడం లేదా రద్దు చేయడం అనేది దేశ సార్వభౌమ హక్కు. బ్రిటన్‌ ఎంపీ డెబీ అబ్రహాంకు గతేడాది అక్టోబరు 7న ఇ-బిజినెస్‌ వీసా జారీ అయ్యింది. అక్టోబరు 5, 2020 వరకు అది చెల్లుబాటు అవుతుంది. అయితే ఇటీవల ఆమె భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం, జాతి ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించడంతో ఫిబ్రవరి 14, 2020న డెబీ వీసా రద్దు చేశారు. రద్దు గురించి అదే రోజున అధికారులు ఆమెకు సమాచారమిచ్చారు’ అని సదరు వర్గాలు వెల్లడించాయి. 

సరైన వీసా లేకపోవడం వల్లే ఆమెను దేశంలోకి అనుమతించకుండా వెనక్కి పంపించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ‘వీసా ఆన్‌ అరైవల్‌’ ద్వారా తనకు వీసా జారీ చేయాలని డెబీ అడిగారని, అయితే యూకే దేశస్థులకు ఆ సదుపాయం లేదని వెల్లడించాయి. అంతేగాక, నిబంధనల ప్రకారం ఇ-బిజినెస్‌ వీసాను వ్యాపార సమావేశం కోసం ఇస్తారని, అంతేగానీ బంధువులను, స్నేహితులను కలవడానికి ఈ వీసాను ఉపయోగించరాదని చెప్పాయి. 

మరోవైపు ఈ విషయాన్ని లండన్‌లోని భారత హైకమిషన్‌ కూడా ధ్రువీకరించింది. డెబీ అబ్రహాం వద్ద సరైన వీసా లేనందునే ఆమెను భారత్‌లోకి అనుమతించలేదని అక్కడి రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. యూకే దేశస్థులకు వీసా ఆన్‌ అరైవల్ నిబంధన వర్తించదని, అందుకే ఆమెను వెనక్కి వెళ్లిపొమ్మని చెప్పినట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. బంధుమిత్రులను కలిసేందుకు డెబీ సోమవారం దిల్లీ విమానాశ్రయం చేరుకోగా.. ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమెను అడ్డుకున్నారు. వీసా రద్దవడంతో ఆమె దుబాయ్‌ వెళ్లిపోయారు. అయితే తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే వీసా రద్దు చేసినట్లు డెబీ ఆరోపించారు. 

ఇదీ చదవండి.. ‘ఆమెను తిప్పి పంపడం సమంజసమే’


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని