దేశ ప్రయోజనాలకే కఠిన నిర్ణయాలు: మోదీ

తాజా వార్తలు

Published : 17/02/2020 01:42 IST

దేశ ప్రయోజనాలకే కఠిన నిర్ణయాలు: మోదీ

వారణాసి: భారత ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో పర్యటించారు. పర్యటనలో భాగంగా మోదీ దాదాపు రూ.1254కోట్ల వ్యయంతో ఇక్కడ చేపట్టనున్న 50 ప్రాజెక్టులను ప్రారంభించారు. ప్రత్యేక విమానం ద్వారా వారణాసికి చేరుకున్న మోదీకి.. యూపీ గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌, సీఎం యోగిఆదిత్యనాథ్‌ స్వాగతం పలికారు. అనంతరం మోదీ జంగంవాడీ మఠానికి వెళ్లి పూజలు నిర్వహించారు. ఆ వెంటనే శ్రీజగద్గురు విశ్వరాధ్య గురుకుల్‌ శత జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొని.. అక్కడ 19 భాషల్లోకి అనువదించిన శ్రీ సిద్ధాంత్‌ శిఖామణి గ్రంథాన్ని, మొబైల్‌ యాప్‌ను విడుదల చేశారు. 

పండిత్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ విగ్రహావిష్కరణ
అనంతరం భారతీయ జనసంఘ్‌ నాయకుడు పండిత్ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ స్మారక కేంద్రాన్ని ప్రారంభించి దాన్ని జాతికి అంకితం చేశారు. దాంతో పాటు 63 అడుగుల దీన్‌దయాళ్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత మూడు జ్యోతిర్లింగాలను తాకుతూ ప్రయాణించనున్న ఐఆర్‌సీటీసీ తొలి ప్రైవేటు రైలు ‘మహా కాళ్‌ ఎక్స్‌ప్రెస్‌’ను వీడియోలింక్‌ ద్వారా ప్రారంభించారు. ఈ రైలు యూపీలోని వారణాసి, మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిన్, ఓంకారేశ్వర్‌లను కలుపుతూ ప్రయాణిస్తుంది. పర్యటనలో భాగంగా మోదీ వారణాసిలో 430 పడకల సూపర్‌ స్పెషాలిటీ ప్రభుత్వ ఆస్పత్రిని ఆయన ప్రారంభించారు. 

రామజన్మభూమి ట్రస్టు వేగంగా పనిచేస్తోంది..
ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ.. దేశ ప్రయోజనాల కోసమే ఆర్టికల్‌ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టం వంటి నిర్ణయాలు తీసుకున్నామని అన్నారు. ఆ విషయంలో ఒత్తిళ్లు ఉన్నప్పటికీ తాము తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. భారత్‌ 5ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారేందుకు పర్యాటక రంగం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. అత్యాధునిక సాంకేతికతతో వారణాసితో పాటు అన్ని దర్శనీయ స్థలాలను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన ట్రస్టు వేగంగా పని చేస్తోందని వెల్లడించారు. రామజన్మభూమి అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం సుప్రీంకోర్టు సూచనల మేరకు కేంద్రం శ్రీరామ జన్మభూమి ట్రస్టు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని