ట్రంప్‌ భారత పర్యటన ముహూర్తం ఖరారు..

తాజా వార్తలు

Updated : 24/02/2020 09:56 IST

ట్రంప్‌ భారత పర్యటన ముహూర్తం ఖరారు..

శ్వేతసౌధం అధికారిక ప్రకటన

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత పర్యటనపై శ్వేతసౌధం కీలక ప్రకటన చేసింది. ఫిబ్రవరి 24-25 తేదీల్లో ఆయన భారత్‌లో పర్యటించనున్నట్లు మంగళవారం వెల్లడించింది. ట్రంప్‌ భారత్‌కు రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఆయన సతీమణి, ప్రథమ పౌరురాలు మెలానియాతో కలిసి భారత్‌కు రానున్న ట్రంప్‌.. దిల్లీ, అహ్మదాబాద్‌లో పర్యటించనున్నారని శ్వేతసౌధం మీడియా సెక్రటరీ స్టెఫానీ గ్రిషమ్‌ వెల్లడించారు. గతవారం ప్రధాని మోదీ, ట్రంప్‌ పర్యటనపై ఫోన్‌లో చర్చించారని తెలిపారు. ఈ పర్యటనతో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక బంధం ఉన్నత శిఖరాలకు చేరుతుందని ఆకాంక్షించారన్నారు.

ఉభయ దేశాల మధ్య కీలక వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్న వేళ ట్రంప్‌ పర్యటన ఖరారు కావడాన్ని ఇరు దేశాల వ్యాపార వర్గాలు స్వాగతించాయి. దీంతో గత కొన్ని నెలలుగా తలెత్తిన వాణిజ్య విభేదాలు సమసిపోతాయని ఆకాంక్షించారు. దీన్ని కీలక పర్యటనగా పేర్కొన్న ‘భారత్‌-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక’ అధ్యక్షుడు ముకేశ్‌ ఆఘి.. అమెరికా అధ్యక్షుడు భారత్‌లో పర్యటించడం వరుసగా ఇది మూడోసారి అని గుర్తుచేశారు. దీంతో భారత్‌ను ట్రంప్‌ కీలక భాగస్వామిగా భావిస్తున్న విషయం అర్థమవుతోందన్నారు. 

అయితే అహ్మదాబాద్‌లో ‘హౌడీ-మోదీ’ తరహా సభ ఏర్పాటు చేయనున్నారరన్న ఊహాగానాలపై మాత్రం ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. ఈ పర్యటనలో ప్రధానంగా ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా చైనాతో తొలి దశ ఒప్పందంపై సంతకం చేసిన ట్రంప్‌ భారత్‌తోనూ ఆ తరహా విధానానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. అలాగే చైనా, పాకిస్థాన్‌, ఇరాన్‌, అఫ్గానిస్థాన్‌లో తాజా పరిస్థితులతో పాటు ఇండో-పసిఫిక్‌ ప్రాంత భద్రతపై ప్రధానంగా చర్చలు జరిపే అవకాశం ఉంది. చమురు, సహజ వాయువు సరఫరా భద్రతపై అమెరికా నుంచి భారత్‌ హామీ కోరేందుకు యత్నిస్తోంది. పలు సైనిక కొనుగోలు ఒప్పందాలు కూడా ఖరారయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని