చైనా పౌరులారా.. భారత్‌కు రావొద్దు

తాజా వార్తలు

Published : 06/02/2020 14:47 IST

చైనా పౌరులారా.. భారత్‌కు రావొద్దు

వీసాలను నిలిపివేసిన భారత్‌
కరోనా భయం.. పెళ్లి లైవ్‌స్ట్రీమింగ్‌


దిల్లీ: కరోనా వైరస్‌ మహమ్మారి రోజురోజుకీ విజృంభిస్తూ ప్రపంచ దేశాలను భయపెడుతోంది. ఈ నేపథ్యంలోనే భారత్‌కు వచ్చేందుకు చైనా జారీ చేసిన అన్ని వీసాలను నిలిపివేస్తున్నట్లు ఇమ్మిగ్రేషన్‌ అధికారులు గురువారం ప్రకటించారు. ఫిబ్రవరి 5వ తేదీకి ముందు చైనా పౌరులకు జారీ చేసిన అన్ని వీసాలు, రెగ్యులర్‌, ఎలక్ట్రానిక్‌, ఈ వీసాలను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. కరోనా బారిన పడి ఇప్పటి వరకు 560 మంది ప్రాణాలు కోల్పోగా బాధితుల సంఖ్య 27,300 దాటింది. వైరస్‌ వ్యాప్తికి ప్రధాన కేంద్రమైన హుబేలోనే ఒక్క రోజులో 70 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. 911 మందికి వ్యాధి తీవ్రత తగ్గడంతో వారిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు.  

‘15 జనవరి తర్వాత చైనా వెళ్లిన విదేశీయులను రోడ్డు, వాయు, సముద్రమార్గం ద్వారా భారత్‌లోకి వచ్చేందుకు అనుమతించడం లేదు. ఇండో-నేపాల్‌, ఇండో-భూటాన్‌, ఇండో-బంగ్లాదేశ్‌, ఇండో-మయన్మార్‌ సరిహద్దుల నుంచి వచ్చే విదేశీయులను కూడా భారత్‌లోకి అనుమతించేది లేదు. ఫిబ్రవరి 5వ తేదీ లోపు చైనా పాస్‌పోర్టు కలిగిన వ్యక్తులకు జారీ చేసిన వీసాలన్నింటినీ నిలిపివేస్తున్నాం. ఇది తక్షణమే అమల్లోకి వస్తుంది. ’ అని ఇమ్మిగ్రేషన్‌ అధికారులు ప్రకటన విడుదల చేశారు. 

కోలుకున్న కరోనా సోకిన వ్యక్తి..

థాయిలాండ్‌లోని బ్యాంకాక్‌లో కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వ్యక్తి కోలుకున్నట్లు థాయ్‌ ఆరోగ్య మంత్రిత్వశాఖ అధికారులు వెల్లడించారు. కరోనా సోకి కోలుకున్న తొలి వ్యక్తిగా అతడు నిలిచాడు. చైనా ప్రయాణికులను తన కారులో ఎక్కించుకోవడంతో 50ఏళ్ల ట్యాక్సీ డ్రైవర్‌కు కరోనా సోకింది. దీంతో అతడికి వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తూ చికిత్స అందించడంతో సదరు వ్యక్తి కోలుకున్నాడు. 

విరామం లేకుండా పనిచేసి మరణించిన వైద్యుడు..

చైనాలోని హునాన్‌ ప్రావిన్స్‌లో కరోనా బాధితులకు నిరంతరం చికిత్స చేస్తూ 28ఏళ్ల వైద్యుడు ప్రాణాలు విడిచాడు. దాదాపు 10 రోజులుగా అతడు విశ్రాంతి లేకుండా విధుల్లో ఉండి రోగులకు చికిత్స అందించాడు. దీంతో అతడికి గుండెపోటు రావడంతో చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. 

పెళ్లి తంతు లైవ్‌స్ట్రీమింగ్‌..

ఇటీవల చైనా పర్యటనకు వెళ్లొచ్చిన సింగపూర్‌ జంట తమ పెళ్లిని లైవ్‌స్ట్రీమింగ్‌ పెట్టింది. కరోనా భయంతో అతిథులు ఎవరూ పెళ్లికి రారని భావించిన ఆ జంట తమ వివాహ వేడుకను అతిథులందరికీ వీడియో కాల్‌ ద్వారా చూపించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని