షింజో అబెకు పద్మవిభూషణ్‌ పురస్కారం

తాజా వార్తలు

Published : 25/01/2021 23:07 IST

షింజో అబెకు పద్మవిభూషణ్‌ పురస్కారం

దిల్లీ: జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబెను భారతదేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌‌ పురస్కారం వరించింది. ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి అందించే అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డులను సోమవారం ప్రకటించారు. అందులో భాగంగా ఈ ఏడాది ఏడుగురు వ్యక్తులు పద్మవిభూషణ్‌ పురస్కారానికి ఎంపిక కాగా.. వారిలో జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబె కూడా ఉండటం విశేషం. గతేడాది ఆగస్టులో జపాన్‌ ప్రధాని పదవికి రాజీనామా చేసిన అబే.. భారత్‌, జపాన్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఎంతో కృషి చేశారు. ఆయన భారత పర్యటనకు వచ్చినప్పుడు ఇక్కడి పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి ‘రెండు సముద్రాల సంగమ’ వ్యూహంపై ప్రసంగించారు. అప్పట్లో ఆయన చెప్పిన ఆ ప్రతిపాదన సంచలనమై.. ‘ఇండో పసిఫిక్‌ వ్యూహం’గా రూపాంతరం చెంది చైనాను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. తన ఎనిమిదేళ్ల పదవీకాలంలో భారత్‌ను నాలుగు సార్లు సందర్శించిన రికార్డు కూడా ఆయనదే.

రాజకీయ అస్థిరతకు ముగింపు
జపాన్‌ జపాన్‌ రాజకీయాల్లోని అస్థిరతకు ముగింపు పలికి.. షింజో అబె ఎక్కువ కాలం ఆ దేశానికి ప్రధానిగా చరిత్ర సృష్టించారు. ప్రపంచంలోనే మూడో ఆర్థిక శక్తికి రాజకీయ స్థిరత్వాన్ని తీసుకొచ్చిన ఘనత ఆయనదే. అబె 2006లోనే ప్రధాని అయినా పెద్దపేగు సమస్యతో ఏడాదికే రాజీనామా చేశారు. ఆయన తరవాత ఆరేళ్లలో ఆరుగురు ప్రధానులు మారడం అక్కడి రాజకీయ అస్థిరతకు నిదర్శనం. దీంతో 2012లో రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక ఏకధాటిగా ఎనిమిదేళ్లపాటు కొనసాగారు. తాత స్థాపించిన ‘లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీ’ నుంచి ఈ పదవి చేపట్టిన అబెకు అడుగడుగునా సవాళ్లే ఎదురయ్యాయి. 2012లో అధికారం చేపట్టేనాటికి జపాన్‌ ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు మందగించింది. ఈ క్రమంలో అబె చేపట్టిన ఆర్థిక విధానాలు జపాన్‌ వృద్ధిరేటును పట్టాలెక్కించాయి. షింజో ఆర్థిక విధానాలు జపాన్‌లో ‘అబెనామిక్స్‌’గా ప్రసిద్ధి చెందాయి. 

చైనా ముప్పును ముందే పసిగట్టి!
యూఎస్‌ఏలో ట్రంప్‌ అధికారం చేపట్టాక జపాన్‌-అమెరికా సంబంధాలు దెబ్బతినకుండా కాపాడిన ఘనత కూడా అబెదే. చైనా ముప్పును దాదాపు పుష్కరకాలం ముందే పసిగట్టి అమెరికా, భారత్‌, ఆస్ట్రేలియా, జపాన్‌లతో కూడిన బలమైన చతుర్భుజ కూటమికి 2007లోనే ప్రాణం పోశారు. రక్షణ వ్యూహాల్లో హిందూ-పసిఫిక్‌ మహాసముద్రాలను కలిపి చూడాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. ఇదే భారత్‌-జపాన్‌ సంబంధాలకు మూలస్తంభంగా మారింది. ఆయన చేసిన ‘ఇండో పసిఫిక్‌’ ప్రతిపాదనే ఇప్పుడు చైనాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అంతేకాకుండా ఆ ప్రతిపాదనే అమెరికాను భారత్‌కు చేరువ చేసింది. 

మోదీ-అబెల శకం కీలక అధ్యాయం
భారత గణతంత్ర దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తొలి జపాన్‌ ప్రధానిగా 2014లో గణతికెక్కారు. మోదీ ప్రభుత్వంతో బలమైన సంబంధాలు కొనసాగించారు. భారత్‌-జపాన్‌ సంబంధాల్లో మోదీ-అబె శకం ఓ కీలక అధ్యాయంగా మిగిలిపోతుంది. 2014లో మోదీ జపాన్‌ పర్యటన సందర్భంగా ఇరుదేశాల సంబంధాలను పటిష్ఠం చేసుకొనేలా ఓ అణు ఒప్పందానికి బీజం పడింది. 2016లో కుదిరిన ఒప్పందం 2017 నుంచి అమలులోకి వచ్చింది. భారత్‌లోని మౌలిక ప్రాజెక్టులకు జపాన్‌ భారీగా నిధులు సమకూర్చింది. తొలి బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుకు ఏకంగా రూ.88వేల కోట్లను నామమాత్రపు వడ్డీకి ఇచ్చింది. 2016లో భారత ప్రధాని జపాన్‌ పర్యటన సందర్భంగా 10 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. 2018లో జరిగిన 13వ ఇండో-జపాన్‌ వార్షిక సదస్సులో ఏకంగా 32 ఒప్పందాలపై సంతకాలయ్యాయి. 

భారత్‌లో విశేష పెట్టుబడులు
భారత్‌తో జపాన్‌కు ఉన్న సత్సంబంధాల కారణంగా.. ఏటా మన దేశంలో జపాన్‌ పెట్టుబడులు దాదాపు 350 కోట్ల డాలర్లకు చేరాయి. చైనాకు భయపడి అరుణాచల్‌ ప్రదేశ్‌లో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు సమకూర్చేందుకు ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు వంటి సంస్థలు వెనకడుగు వేస్తే- జపాన్‌ దాదాపు రూ.13వేల కోట్లను ఈశాన్య రాష్ట్రాల్లో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. కానీ సీఏఏ ఆందోళనల కారణంగా గువాహటీలో షింజో అబె హాజరుకావాల్సిన ‘2019 ఇండో-జపాన్‌’ వార్షిక సదస్సు వాయిదా పడటంతో ఈ ప్రతిపాదనలు నిలిచిపోయాయి. 

ఇవీ చదవండి
ఎస్పీ బాలుకు పద్మవిభూషణ్‌
కర్నల్‌ సంతోష్‌బాబుకు ‘మహావీరచక్ర’ 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని