బెంగాల్‌, అసోంలో ముగిసిన తొలివిడత పోలింగ్‌

తాజా వార్తలు

Updated : 27/03/2021 19:25 IST

బెంగాల్‌, అసోంలో ముగిసిన తొలివిడత పోలింగ్‌

దిల్లీ: పశ్చిమ బెంగాల్‌, అసోం అసెంబ్లీ ఎన్నికల్లో తొలి విడత ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. పశ్చిమబెంగాల్‌లో 30 నియోజకవర్గాల్లో జరిగిన ఈ ఎన్నికల్లో పలుచోట్ల చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. సాయంత్రం 6గంటల వరకు బెంగాల్‌లో 79.79శాతం పోలింగ్‌ నమోదు కాగా.. అసోంలో 72.14శాతం పోలింగ్‌ నమోదైంది. ఉదయం 7గంటల నుంచే పోలింగ్‌ ప్రారంభం కావడంతో ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కరోనా నేపథ్యంలో మరో గంట పాటు పోలింగ్‌ సమయం పెంచడంతో సాయంత్రం 6గంటల వరకు ఓటర్లను అనుమతించారు. అసోంలో 47 స్థానాల్లో ఎన్నికలు జరగ్గా.. 72శాతానికి పైగా పోలింగ్‌ నమోదైంది. సాయంత్రం 6గంటలకు క్యూలైన్లలో వేచి ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు.

బెంగాల్‌లోని పశ్చిమ మిడ్నాపూర్‌లో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సల్బోని పోలింగ్‌ బూత్‌ వద్ద సీపీఎం, భాజపా మద్దతుదారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. అలాగే, మోహన్‌పూర్‌ పోలింగ్‌ బూత్‌ వద్ద భాజపా, టీఎంసీ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో పోలీసులు లాఠీఛార్జి చేసి చెదరగొట్టారు. బెంగాల్‌లో ఎనిమిది విడతల్లో, అసోంలో మూడు విడతల్లో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని