pak and turkey: పాక్‌ పెద్దన్న కూడా గ్రేలిస్ట్‌లోకి..!

తాజా వార్తలు

Updated : 22/10/2021 13:49 IST

pak and turkey: పాక్‌ పెద్దన్న కూడా గ్రేలిస్ట్‌లోకి..!

 టర్కీపై కొరడా ఝుళిపించిన ఎఫ్‌ఏటీఎఫ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

పాకిస్థాన్‌కు ప్రతి విషయంలో వంతపాడి పెద్దన్నగా వ్యవహరించినందుకు టర్కీ ఫలితం అనుభవిస్తోంది. ఒకప్పుడు ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా పేరు తెచ్చుకొన్న టర్కీ ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. సరికొత్త ఒట్టమాన్‌ సామ్రాజ్యం స్థాపించాలనుకున్న ఎర్డగాన్‌ ప్రయత్నం బెడిసికొట్టింది. దీంతో భవిష్యత్తులో నిధుల కోసం కటకటలాడనుంది. ఇక ఎఫ్‌ఏటీఎఫ్‌ (ఆర్థిక కార్యదళం) నుంచి బయటపడదామన్న పాక్‌ ప్రయత్నాలు పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు.

ఆర్థిక కార్యదళం గురువారం కీలక నిర్ణయం తీసుకొంది. టర్కీని గ్రేలిస్ట్‌లోకి చేర్చింది. మనీ లాండరింగ్‌, ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం వంటి పనులు చేస్తున్నందుకు శిక్షగా ఈ నిర్ణయం తీసుకొంది. దీంతో కొన్నేళ్లపాటు టర్కీలోకి పెట్టుబడులు వచ్చే అవకాశం తగ్గిపోయింది. టర్కీతోపాటు మాలీ, జోర్డాన్‌ను కూడా ఈ జాబితాలోకి చేర్చింది. పాక్‌ ఈ జాబితాలోనే కొనసాగుతోంది. బోట్సువానా, మారిషస్‌లను ఈ జాబితా బయటకు తెచ్చింది.

టర్కీ బ్యాంకింగ్‌ వ్యవస్థ, రియల్‌ ఎస్టేట్‌, బంగారం, రత్నాల డీలర్లు ఆర్థిక అవకతవకలకు పాల్పడుతున్నారని ఎఫ్‌ఏటీఎఫ్‌ అధ్యక్షుడు మార్కస్‌ ప్లియర్‌ పేర్కొన్నారు. అంతేకాదు మనీలాండరింగ్‌, ఐఎస్‌ఐఎల్‌, అల్‌ఖైదా వంటి ఉగ్రవాద  సంస్థలకు నిధులు సమకూర్చడం వంటి వాటిపై విచారణ జరిపి అడ్డుకోవాలన్నారు.

2019లో తీరుమార్చుకోమని ఎఫ్‌ఏటీఎఫ్‌ ఓ సారి టర్కీని హెచ్చరించింది. ఉగ్ర సంస్థల ఆస్తులు, నిధులను స్తంభింపజేయాలని సూచించింది. కానీ, ఎర్డగాన్‌ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది.

ఎర్డగాన్‌ చర్యలతో పతనమైన లీరా..

ఓ పక్క ఎఫ్‌ఏటీఎఫ్‌ టర్కీని గ్రే లిస్ట్‌లో చేర్చడం, మరోపక్క ఆ దేశ సెంట్రల్‌ బ్యాంక్‌ వడ్డీరేట్లను తగ్గించడం కరెన్సీపై ప్రతికూల ప్రభావం చూపింది. ఆ దేశ కరెన్సీ లీరా విలువ భారీగా పతనమైంది. ఇప్పటికే డాలర్‌తో పోలిస్తే గత ఐదేళ్లలో లీరా  30 శాతానికి పైగా పతనం అయింది. తాజాగా ఈ కరెన్సీ  మరో 2శాతం విలువ కోల్పోయింది. టర్కీ అధ్యక్షుడు సంప్రదాయక ఆర్థిక విధానాలను అనుసరించాలని ఒత్తిడి తేవడంతో వడ్డీరేట్లను తగ్గించారు. ఓ పక్క ద్రవ్యోల్బణం పెరుగుతున్నా.. టర్కీ ఆర్థిక వ్యవస్థలోకి నిధుల ప్రవాహాన్ని గణనీయంగా పెంచేందుకు ఎర్డగాన్‌ చేస్తున్న ప్రయత్నాలు ప్రతికూల ఫలితాలను ఇస్తున్నాయి. గత రెండేళ్లలో ఎన్నడూ లేనంత స్థాయికి ద్రవ్యోల్బణం చేరిందని ఇటీవల ఫైనాన్షియల్‌ టైమ్స్‌ పత్రిక పేర్కొంది. అక్టోబర్‌ మొదటి వారంలో విడుదలైన గణాంకాల ప్రకారం వినిమయ ధరల సూచీ 19.58శాతం పెరిగింది. ఆ దేశ కేంద్ర బ్యాంకు విధించిన ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని దాటేసి నాలుగు రెట్లు పెరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఎఫ్‌ఏటీఎఫ్‌ గ్రే లిస్ట్‌లోకి చేరింది. దీంతో విదేశీ పెట్టుబడులు టర్కీకి వచ్చే అవకాశం ఏమాత్రం లేదు. టర్కీ మానిటరీ పాలసీలో ఎర్డగాన్‌ జోక్యం చేసుకోవడాన్ని గమనించిన విదేశీ పెట్టుబడిదారులు ఆదేశాన్ని వీడుతున్నారు.

సులేమానీ బ్రిగేడ్‌ విషయం బయటకొచ్చిన ఏడాదిలోపే..

సిరియా నుంచి కిరాయి ఉగ్రమూకను కశ్మీర్‌లోకి తరలించాలని కుట్రలు పన్నుతున్న విషయాన్ని గతేడాది గ్రీకు జర్నలిస్టు ఆండ్రెస్‌ మౌంటుజోర్లియస్‌ వెలుగులోకి తెచ్చాడు. ‘పెంటపోస్టగ్మా’ అనే గ్రీకు పత్రిక దీనిపై విస్తృత కథనాన్ని ప్రచురించింది. దక్షిణాసియాలో పరపతి పెంచుకొని సౌదీ అరేబియాను సవాల్‌ చేయాలన్న వ్యూహంలో భాగంగా టర్కీ ఈ కుట్ర పన్నిందని పేర్కొంది. ఇందుకు కశ్మీర్‌ను పావుగా వాడుకోవడానికి సిద్ధమవుతోంది. కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని పెంచే పనిని సులేమానీ షా బ్రిగేడ్‌కు అప్పగించినట్లు అప్పట్లో ఆ పత్రిక పేర్కొంది. ఈ బ్రిగేడ్‌ సిరియన్‌ నేషనల్‌ ఆర్మీలో పనిచేసిందని వెల్లడించింది. దీని నాయకుడు అబూ ఎమ్సా తన బృంద సభ్యులతో సమావేశమై కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని పెంచాలనే టర్కీ లక్ష్యాన్ని వెల్లడించినట్లు ఈ కథనం పేర్కొంది. కిరాయి బృందంలో ఒక్కోరికి 2వేల డాలర్లు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు వివరించింది.

పాక్‌ నుంచి ప్రవహిస్తున్న ఉగ్ర నిధులు..

ఈ సారి ఎఫ్‌ఏటీఎఫ్‌ గ్రే లిస్ట్‌ నుంచి బయటపడాలని పాక్‌ తీవ్రంగానే ప్రయత్నించింది. ఈ సంస్థ అప్పగించిన 27 పాయింట్ల ప్రణాళికలో 26 అమలు చేసినట్లు పాక్‌ చెప్పుకొంది. కానీ, ఎఫ్‌ఏటీఎఫ్‌ దానిని నమ్మలేదు. పాక్‌ నుంచి ఇంకా ఉగ్రవాదులకు నిధులు చేరుతున్నాయని పేర్కొంది. దీంతోపాటు ఐరాస ఉగ్రజాబితాలోని వారిపై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని పేర్కొంది.

ఇక పాక్‌, టర్కీలు కశ్మీర్‌ విషయంలో ఒకే వాదన వినిపిస్తున్నాయి. కశ్మీర్‌ నుంచి వెళ్లేవారు ఐఎస్‌ఐతో భేటీ అయ్యేందుకు టర్కీ ఒక వేదిక వలే వ్యవహరిస్తోంది.  ఇటీవల కూడా ఐరాసలో టర్కీ అధ్యక్షుడు ఎర్డగాన్‌ కశ్మీర్‌ అంశాన్ని ప్రస్తావించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని