జీఎస్టీ కౌన్సిల్‌ భేటీ: ఈ సంగ్మా గురించి తెలుసా?

తాజా వార్తలు

Updated : 11/06/2021 18:28 IST

జీఎస్టీ కౌన్సిల్‌ భేటీ: ఈ సంగ్మా గురించి తెలుసా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా మందులు, పరికరాలపై పన్నులు తగ్గించే విషయమై చర్చించడానికి జీఎస్టీ కౌన్సిల్‌ మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ మంత్రుల బృందం జీఎస్టీ కౌన్సిల్‌కు నివేదికను సమర్పించింది. ఈ బృందంలో తమ ఆర్థిక మంత్రులకు చోటు దక్కలేదని కాంగ్రెస్‌ పార్టీ అభ్యంతరం సైతం వ్యక్తంచేసింది. అయితే, మొత్తం 8 మంది సభ్యులున్న ఈ బృందానికి కన్రాడ్‌ సంగ్మాను కన్వీనర్‌గా నియమితులయ్యారు. గుజరాత్‌, మహారాష్ట్ర కేరళ, తెలంగాణ, ఒడిశా, యూపీకి చెందిన మంత్రులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. పెద్ద పెద్ద రాష్ట్రాల మంత్రులు ఈ బృందంలో ఉన్నప్పటికీ చిన్న రాష్ట్రమైన మేఘాలయకు చెందిన సంగ్మాకే కన్వీనర్‌ బాధ్యతలు అప్పగించడం వెనుక బహుశా ఆయన నేపథ్యం కారణం కావొచ్చని తెలుస్తోంది. రేపు జీఎస్టీ కౌన్సిల్‌లో ఈ బృందం సమర్పించిన నివేదికపై చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో ఇంతకీ ఈ సంగ్మా ఎవరో ఇప్పుడు చూద్దాం..

కన్రాడ్‌ సంగ్మా (43) కేవలం మేఘాలయ ఆర్థిక మంత్రే కాదు.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా. 1978 జనవరి 27న జన్మించారాయన. అంతేకాదు ఈశాన్య రాష్ట్రాల నుంచి తొలిసారి లోక్‌సభ స్పీకర్‌గా వ్యవహరించిన పీఏ సంగ్మా కుమారుడు. తండ్రి నుంచి రాజకీయ వారసత్వం అందుకున్న సంగ్మా ప్రస్తుతం నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌పీపీ)కి అధ్యక్షుడిగానూ వ్యవహరిస్తున్నారు. మేఘాలయలో పుట్టినప్పటికీ సంగ్మా బాల్యం అంతా దిల్లీలోనే సాగింది. దిల్లీలోని సెయింట్‌ కొలంబియా స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసుకున్న ఆయన.. యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియా నుంచి బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ డిగ్రీని అందుకున్నారు. ఇంపీరియల్‌ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌ నుంచి ఎంబీఏ ఫైనాన్స్‌లో ఉత్తీర్ణులయ్యారు.

2008లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై ఆర్థికం, విద్యుత్‌, పర్యాటకం, ఐటీ వంటి కీలక శాఖల బాధ్యతలను నిర్వర్తించారు. ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన 10 రోజులకే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ద్వితీయ స్థానం సాధించినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటులో చాకచక్యంగా వ్యవహరించారు. 60 సీట్లున్న అసెంబ్లీలో కాంగ్రెస్‌ అత్యధిక స్థానాలు సాధించినప్పటికీ ప్రాంతీయ పార్టీలను కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు కన్రాడ్‌ సంగ్మా. ఈ కూటమిలో భాజపా కూడా ఉంది. అప్పటి వరకు లోక్‌సభ సభ్యుడిగా ఉన్న సంగ్మా ఆ తర్వాత తురా నియోజకవర్గ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచి సీఎంగా కొనసాగుతున్నారు. తన తండ్రి పేరుమీదుగా ఏర్పాటైన పీఏ సంగ్మా ఫౌండేషన్ ద్వారా మేఘాలయ గ్రామీణ ప్రాంతాల్లో వివిధ సహాయక కార్యక్రమాలు చేపడుతున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని