పండగ రూపంలో ముంచుకొస్తున్న ప్రమాదం!

తాజా వార్తలు

Updated : 30/11/2020 10:11 IST

పండగ రూపంలో ముంచుకొస్తున్న ప్రమాదం!

అమెరికాలో కరోనా వ్యాప్తిపై నిపుణుల ఆందోళన

వాషింగ్టన్‌: ఇప్పటికే కరోనా మహమ్మారితో అతలాకుతలమవుతున్న అమెరికాలో రానున్న రోజుల్లో కొత్త కేసులు మరింత వెల్లువలా నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు. క్రిస్మస్‌‌, థ్యాంక్స్‌ గివింగ్‌ నేపథ్యంలో కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు భారీ ఎత్తున సమావేశమయ్యే అవకాశం ఉండడమే దీనికి కారణమని తెలిపారు. ఇప్పటికే అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య 13 మిలియన్లు దాటింది. వీరిలో 2,65,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం ఒక్కరోజే ఏకంగా రెండు లక్షల కేసులు నమోదు కావడం గమనార్హం. 

అమెరికాలో కొవిడ్‌ విజృంభిస్తున్న తీరుపై ఆ దేశ అంటువ్యాధుల నివారణ నిపుణుడు ఆంటోనీ ఫౌచీ ఆందోళన వ్యక్తం చేశారు. థ్యాంక్స్‌ గివింగ్‌ వేడుకల తర్వాత కేసులు భారీ స్థాయిలో పెరుగుతాయని అంచనా వేశారు. పండగ సీజన్‌ నేపథ్యంలో సమావేశాలు, ప్రయాణాలు పెరుగుతాయని.. దీంతో వ్యాప్తి తీవ్రమవుతుందని తెలిపారు. ఇది ఎవరినీ బయపెట్టడానికి చెబుతున్న మాటలు కావని.. ప్రజల్ని అప్రమత్తం చేయడం కోసమేనని అభిప్రాయపడ్డారు. తొలినాళ్లలో కరోనా సమర్థంగా ఎదుర్కొన్న దేశాల్లో మహమ్మారి మరోసారి విజృంభిస్తోందని ఫౌచీ గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ప్రజలు కరోనా వ్యాప్తిని అరికట్టే నిబంధనల్ని తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఫిబ్రవరి కల్లా వ్యాక్సిన్‌ సామాన్య ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అప్పటి వరకు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రం చేసుకోవడం వంటి చర్యలు చాలా చిన్నవిగా అనిపించినా.. అవే పెద్ద ప్రమాదాన్ని తప్పిస్తాయని వివరించారు.

కొవిడ్‌ వ్యాప్తి తీరుపై మరో నిపుణురాలు డెబోరా బిర్‌క్స్‌ సైతం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘రెండో విడత వ్యాప్తిలో రోజుకి 25 వేల కేసులు వెలుగులోకి వచ్చాయి. మరణాల రేటు కాస్త తక్కువగానే ఉంది. థ్యాంక్స్‌ గివింగ్‌ తర్వాత వైరస్‌ వ్యాప్తి పదింతలు పెరిగే అవకాశం ఉంది. ఏం జరుగుతుందోనని ఆందోళనగా ఉంది’’ అని బిర్‌క్స్‌ అభిప్రాయపడ్డారు. కొవిడ్‌ నివారణ నిమిత్తం శ్వేతసౌధంలో ఏర్పాటు చేసిన కార్యదళానికి బిర్‌క్స్‌ సమన్వయకర్తగా ఉన్న విషయం తెలిసిందే.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని