Kejriwal: వాయు కాలుష్యంపై దిల్లీ వార్‌.. 10పాయింట్ల వ్యూహం ఇదే!

తాజా వార్తలు

Published : 05/10/2021 01:27 IST

Kejriwal: వాయు కాలుష్యంపై దిల్లీ వార్‌.. 10పాయింట్ల వ్యూహం ఇదే!

దిల్లీ: దేశ రాజధాని నగరాన్ని ఊపిరాడనీయకుండా చేసే వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు కేజ్రీవాల్‌ ప్రభుత్వం పకడ్బందీ వ్యూహాలను అమలుచేస్తోంది. ఈ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇప్పటికే సరి-బేసి విధానం సహా పలు చర్యలను చేపట్టిన అక్కడి ప్రభుత్వం.. తాజాగా ‘వింటర్‌ యాక్షన్‌ ప్లాన్‌’ పేరిట 10 పాయింట్ల ప్రణాళికను ప్రకటించింది. ఈ మేరకు సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఈ ప్రణాళికను ప్రకటించారు. శీతాకాలంలో వాయు కాలుష్యం దిల్లీ నగరాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ముందుగానే ఈ ప్రణాళికను విడుదల చేశారు. అంతేకాకుండా కాలుష్య నివారణకు పరస్పరం సహకరించుకుంటూ సమష్టిగా పోరాడదామని పొరుగు రాష్ట్రాలకు విజ్ఞప్తి చేశారు. 

వింటర్‌ యాక్షన్‌ ప్లాన్‌లో 10 అంశాలివే..

పంట వ్యర్థాలను కాల్చకుండా బయో డీ-కంపోజర్‌ స్ర్పే చేయడం; దుమ్ము, ధూళి కాలుష్యాన్ని నియంత్రణకు కార్యాచరణ; చెత్తను తగులబెడితే జరిమానా విధించడం; బాణసంచాపై నిషేధం; స్మాగ్‌ టవర్ల ఏర్పాటు; హాట్‌స్పాట్‌ల పర్యవేక్షణ; గ్రీన్‌వార్‌ రూమ్‌లు బలోపేతం చేయడం; గ్రీన్‌ దిల్లీ యాప్‌; దేశంలోనే తొలి ఈ-వ్యర్థాల పార్కు; వాహనాల కాలుష్య నియంత్రణ చేయడం

స్మాగ్‌ టవర్‌తో మంచి ఫలితాలొచ్చాయ్‌..

శీతాకాలంలో వాయుకాలుష్యం విపరీతంగా పెరిగిపోవడానికి ప్రధాన కారణం పంట వ్యర్థాలను తగులబెట్టడమేనని, ఈ వ్యవహారంపై పొరుగు రాష్ట్రాలు గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ ఏమీ చేయడంలేదని ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ విమర్శించారు. గాలిని స్వచ్ఛంగా ఉంచేందుకు ఉమ్మడిగా కృషిచేద్దామని ఆయా రాష్ట్రాలకు పిలుపునిచ్చారు. పంట వ్యర్థాల మేనేజ్‌మెంట్‌కు దిల్లీ మాదిరిగానే బయో డీ-కంపోజర్‌ పద్ధతిని విస్తృతంగా అమలుచేయాలని కోరారు. దిల్లీలో నిర్మాణంలో ఉన్న కట్టడాల నుంచి వచ్చే ధూళిని నియంత్రణను పర్యవేక్షించేందుకు 75 బృందాలు; అలాగే, చెత్తను తగులబెట్టే అంశాన్ని పర్యవేక్షించేందుకు 250 బృందాలను ఏర్పాటు చేసినట్టు సీఎం తెలిపారు. కన్నౌట్‌ ప్లేస్‌ వద్ద ఏర్పాటు చేసిన స్మాగ్‌ టవర్‌ మంచి ఫలితాలను ఇచ్చిందని.. దాని పనితీరును పర్యవేక్షించడంతో పాటు నగరంలో అలాంటి మరిన్ని టవర్ల నిర్మాణం చేపడతామన్నారు.

ఈ-వ్యర్థాల కోసం దేశంలోనే తొలి ఎకో పార్కు

కాలుష్య హాట్‌ స్పాట్‌లను సమీక్షించేలా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. వాహనాల నుంచి వచ్చే కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ట్రాఫిక్‌ జామ్‌ సమస్యను పరిష్కరించేందుకు 64 రహదారులను గుర్తించినట్టు తెలిపారు. నగరంలో కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్లు తనిఖీ చేసేందుకు వీలుగా 500 బృందాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. గ్రీన్‌ వార్‌ రూమ్‌లను బలోపేతం చేయడంతో పాటు ప్రజా అవగాహన కార్యక్రమాలు ఈ ‘వింటర్‌ యాక్షన్‌ ప్లాన్‌’లో భాగంగా ఉందన్నారు. ఈ-వ్యర్థాలను నిర్వహించేలా దేశంలోనే తొలి ఎకో పార్కు దిల్లీలో ఏర్పాటవుతోందన్నారు. ప్రస్తుతం వాయు కాలుష్యం నియంత్రణలోనే ఉందని.. కానీ శీతాకాలంలో పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను కాల్చడం వల్ల ఇది పెరుగుతుందని కేజ్రీవాల్‌ ఆందోళన వ్యక్తంచేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని