కరోనా ఉద్ధృతి.. ఆ దేశాలు ‘లాక్‌డౌన్‌’

తాజా వార్తలు

Updated : 03/04/2021 15:58 IST

కరోనా ఉద్ధృతి.. ఆ దేశాలు ‘లాక్‌డౌన్‌’

ఇంటర్నెట్‌డెస్క్‌: ఏడాది కాలంగా యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి.. ఇటీవల మళ్లీ పంజా విసురుతోంది. కొన్ని దేశాల్లో వైరస్‌ విజృంభణ.. అక్కడ మరోసారి ‘లాక్‌డౌన్‌’కు దారితీసింది. ఇప్పటికే ఫ్రాన్స్‌ సహా పలు దేశాలు లాక్‌డౌన్‌ విధించగా.. తాజాగా బంగ్లాదేశ్‌ కూడా ఇదే నిర్ణయం తీసుకుంది.  

బంగ్లాదేశ్‌లో వారంపాటు..

ఈ దేశంలో గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు బయటపడుతున్నాయి. శుక్రవారం అక్కడ 6,800పైగా మంది కొత్తగా వైరస్‌ బారినపడ్డారు. 50మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వైరస్‌ విజృంభణ ఎక్కువగా ఉండటంతో ఇటీవల అక్కడి ప్రభుత్వం పలు దేశాలకు విమాన సర్వీసులను నిలిపివేసింది. తాజాగా వైరస్‌ వ్యాప్తి కట్టడి కోసం వారం రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించింది. ఏప్రిల్‌ 5వ తేదీ సోమవారం నుంచి ఏడు రోజుల పాటు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు బంగ్లా ప్రభుత్వం నేడు ప్రకటించింది. కేవలం అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపింది.

ఫ్రాన్స్‌లో మూడోసారి..

కరోనా తీవ్రతకు యూరప్‌ దేశం ఫ్రాన్స్‌ వణికిపోతోంది. ఇప్పటికే అక్కడ మూడో దశ విజృంభణ కొనసాగుతుండటంతో లాక్‌డౌన్‌ ప్రకటించింది. ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి నెల పాటు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రభుత్వం ఇటీవల వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో ఫ్రాన్స్‌ నాలుగో స్థానంలో ఉంది.

పోలాండ్‌ మూడు వారాలు..

పోలాండ్‌లో రోజువారీ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గతేడాది నవంబరు తర్వాత కేసులు భారీ స్థాయిలో ఉండటం మళ్లీ ఇప్పుడే. దీంతో ప్రభుత్వం కట్టడి చర్యలు చేపట్టింది. మూడు వారాల పాటు అత్యవసరం కాని దుకాణాలు, ఇతర కార్యకలాపాలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. మహమ్మారిపై నియంత్రణ కోల్పోతున్నందునే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని లాక్‌డౌన్‌ ప్రకటన సందర్భంగా అధ్యక్షుడు ఆండ్రెజ్‌ డుడా పార్లమెంట్‌లో అన్నారు.

బెల్జియంలో కఠినంగా..

కరోనా ఉద్ధృతి నేపథ్యంలో బెల్జియం మరోసారి నాలుగు వారాల పాటు కఠిన లాక్‌డౌన్‌ విధించింది. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పాఠశాలలను మూసివేసింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావదొద్దని హెచ్చరించింది. కొత్త నిబంధనల ప్రకారం.. అత్యవసరం కాని దుకాణాల్లోకి కస్టమర్లు అపాయింట్‌మెంట్‌ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. బ్యూటీపార్లర్లు, సెలూన్లను మూసివేసింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని