అమ్మ నగలు తాకట్టు పెట్టి.. కొవిడ్‌ ఆస్పత్రి కట్టి! 

తాజా వార్తలు

Published : 08/05/2021 01:14 IST

అమ్మ నగలు తాకట్టు పెట్టి.. కొవిడ్‌ ఆస్పత్రి కట్టి! 

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా మహమ్మారి మహారాష్ట్రలో సృష్టిస్తున్న బీభత్సం అంతా ఇంతా కాదు. దేశంలోనే అత్యధిక మరణాలు, కేసులు అక్కడే వస్తున్నాయి. ముఖ్యంగా పుణె నగరాన్ని ఈ వైరస్‌ వణికిస్తోంది. ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌, పడకల్లేక అనేకమంది ప్రాణాలు కోల్పోతుండగా.. మరికొందరు రోగులు, వారి కుటుంబ సభ్యులు పడుతున్న అవస్థలను చూసి చలించిపోయాడో వ్యక్తి. ఈ సంక్షోభ సమయంలో తనవంతు ఏదైనా సాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఏకంగా ఓ కొవిడ్ ఆస్పత్రినే నిర్మించాలని తలపెట్టాడు. ఇందుకోసం తగినంత డబ్బు లేకపోవడంతో తన తల్లి, భార్య నగలను తాకట్టు పెట్టి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాడు పుణెకు చెందిన ఉమేశ్‌ చవాన్‌..

వివరాల్లోకి వెళ్తే.. పుణె నగరంలో  కరోనాతో ఆస్పత్రుల్లో చాలా దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. రోగుల తాకిడితో ఒకే మంచంపై ముగ్గురికి చికిత్స అందిస్తున్న దీనావస్థ దాపురించింది. ఈ పరిస్థితులను చూసి పుణెలోని పేటెంట్‌ రైట్స్‌ కౌన్సిల్‌ అనే సంస్థ అధినేతగా ఉన్న ఉమేశ్‌ చవాన్‌ చలించిపోయారు. ఛత్రపతి శివాజీ మహారాజ్‌  పేరుతో 53 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. ఇందుకోసం తన వద్ద తగినంత డబ్బులేకపోవడంతో తన తల్లి, భార్య వద్ద ఉన్న 35 ఔన్సుల బంగారాన్ని తాకట్టు పెట్టి రూ.30లక్షలు తీసుకున్నాడు. అతడు తలపెట్టిన గొప్ప కార్యాన్ని ప్రశంసిస్తూ అనేక మంది స్నేహితులు కూడా సాయం చేసేందుకు ముందుకొచ్చారు. అంతేకాకుండా తన సంస్థలోని సహచర వర్కర్ల సాయంతో కఠినంగా శ్రమించి ఏడు రోజుల్లోనే ఆస్పత్రిని నిర్మించారు. ఈ సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆయన చేసిన ఈ గొప్ప పనికి మద్దతుగా అనేకమంది తమ వంతు సాయం అందిస్తున్నారు. ఛత్రపతి శివాజీ కొవిడ్‌ ఆస్పత్రిలో 33 ఆక్సిజన్‌ పడకలతో పాటు 20 సాధారణ పడకలు ఏర్పాటు చేశారు. ఈ ఆస్పత్రి ఏర్పాటులో డాక్టర్‌ సలీం అల్టేకర్‌, డాక్టర్‌ కిశోర్‌ చిపోలే,. గిరీశ్‌ గాఘ్‌, కునాల్‌ టింగ్రే, అపర్న సాథె కీలకంగా వ్యవహరించారు. వీరితో పాటు పుణె మున్సిపల్‌ కార్పొరేషన్‌ హెల్త్‌ చీఫ్‌ అసిస్‌ భారతి, మాజీ డిప్యూటీ మేయర్‌ డాక్టర్‌ సిద్ధార్థ్ ధాండే, డాక్టర్‌ అమోల్‌ దవలేకర్‌ కూడా తమ వంతు సాయం చేశారు. దీనిపై ఉమేశ్‌ చవాన్‌ మాట్లాడుతూ.. పేటెంట్‌ రైట్స్‌ కౌన్సిల్‌ ద్వారా గత కొన్నేళ్లుగా ఇతర ఆస్పత్రుల్లో రోగులకు తక్కువ ధరల్లోనే మంచి నాణ్యమైన వసతులు అందేలా కృషిచేశామని తెలిపారు. ఛత్రపతి శివాజీ మహారాజ్‌ కొవిడ్‌ ఆస్పత్రిలో కూడా రోగుల అవసరాలను తీర్చేలా అన్ని వసతులు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని