బ్రెజిల్ కరోనా ‘కొత్త’ కలవరం

తాజా వార్తలు

Published : 01/04/2021 12:18 IST

బ్రెజిల్ కరోనా ‘కొత్త’ కలవరం

దక్షిణాఫ్రికా రకాన్ని పోలి ఉందని నిపుణుల వెల్లడి

 

బ్రెసిలియా: కరోనాతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న బ్రెజిల్‌లో మరో కొత్త మ్యూటేషన్‌ వెలుగుచూసింది. అది కూడా దక్షిణాఫ్రికాలో బయటపడిన రకాన్ని పోలి ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. బ్రెజిల్‌లోని సావోపాలో రాష్ట్రంలో దీన్ని గుర్తించినట్లు బుటాంటన్‌ బయోమెడికల్ ఇనిస్టిట్యూట్ వెల్లడించింది. ఈ ఉత్పరివర్తన రకం సోకిన బాధితవ్యక్తి దక్షిణాఫ్రికాలో ప్రయాణించలేదని, అక్కడి నుంచి వచ్చిన వారితో ఎలాంటి సంబంధాలు లేవని బుటాంటన్‌ ప్రెసిడెంట్ డిమాస్ కొవాస్ మీడియాకు వెల్లడించారు. ఇది p1(బ్రెజిల్ రకం)లో మార్పు కావొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. 

ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలు దక్షిణాఫ్రికా రకంపై ఏ మేరకు పనిచేస్తాయనే దానిపై స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా రకంతో పోలిన కొత్త రకం కరోనా బ్రెజిల్‌లో వెలుగుచూడటం అక్కడి వైద్యనిపుణులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే అక్కడ ఒక ఉత్పరివర్తన చెందిన కరోనా కలవరం పుట్టిస్తోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు, మరణాలకు కారణమవుతోంది. వరల్డో మీటర్ గణాంకాల ప్రకారం.. నిన్న 89,200 మందికి కరోనా సోకగా..3,950 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. 

మహమ్మారి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధ్యక్షుడు జైర్‌ బొల్సొనారోపై బ్రెజిల్ వాసులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కరోనా చిన్నపాటి ఫ్లూ అని వ్యాఖ్యానించడం, వైరస్ సోకిన తర్వాత కూడా విలేకరుల సమావేశంలో మాట్లాడటం వంటి పలు విపరీత చర్యలకు పాల్పడ్డారు. అయితే, ప్రస్తుత ఉద్ధృతి కట్టడికి ఆయన చర్యలు తీసుకోకతప్పడం లేదు. ఈ క్రమంలో వైద్య సదుపాయాలను మరింత మెరుగుపర్చేందుకు రెండు రోజుల క్రితం 918 మిలియన్‌ డాలర్ల విలువైన రుణాలకు సంబంధించిన ఉత్తర్వులపై అధ్యక్షుడు సంతకం చేశారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని