Covishield: రెండో డోసుపై ఆందోళన వద్దు..!

తాజా వార్తలు

Published : 18/05/2021 22:10 IST

Covishield: రెండో డోసుపై ఆందోళన వద్దు..!

6నెలల వరకూ ఎప్పుడైనా తీసుకోవచ్చు - నిపుణులు

దిల్లీ: కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ రెండో డోసు గడువును 12-16వారాలకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో యూకే ప్రభుత్వం ఈ గడువును 12 నుంచి 8 వారాలకు తగ్గించింది. దీంతో కొవిషీల్డ్‌పై గడువును భారత్‌లో పెంచడం పట్ల కొందరిలో ఆందోళనకు కారణమవుతోంది. ఈ నేపథ్యంలో గడువు పెంచినప్పటికీ ఎలాంటి ఆందోళన అవసరం లేదని.. వ్యాక్సిన్‌ తొలి డోసు తీసుకున్న 6 నెలల వరకు దాని ప్రభావం ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆ లోపు రెండో డోసు ఎప్పుడైనా తీసుకోవచ్చని సూచిస్తున్నారు.

దేశంలో కరోనా వ్యాక్సిన్‌ కొరత ఏర్పడిన సమయంలోనే కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ రెండు డోసుల మధ్య గడువు పెంచడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో డోసుల మధ్య గడువు పెంచినప్పటికీ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇమ్యూనాలజిస్ట్‌ సత్యజిత్‌ రథ్‌ స్పష్టం చేస్తున్నారు. తొలి డోసు తీసుకున్న నాలుగు వారాల అనంతరం ఆరు నెలలలోపు ఎప్పుడైనా రెండో డోసు తీసుకోవచ్చని పేర్కొన్నారు. అంతేకాదు, మొదటి డోసు తర్వాత నెలలోపు రెండో డోసు తీసుకుంటే అంత గొప్ప ప్రతిఫలం ఉండకపోవచ్చని శాస్త్రవేత్తల అంచనా. అందుచేత మొదటి డోసు తర్వాత కనీసం నాలుగు వారాల గడువు అనంతరం ఎప్పుడైనా తీసుకోవచ్చని సత్యజిత్‌ రథ్‌ పేర్కొన్నారు. ఆరు నెలల లోపు ఏ సమయంలోనైనా తీసుకోవచ్చని.. ఇలా తీసుకోవడం వల్ల శరీరంలో వ్యాక్సిన్‌ ప్రభావం మెరుగుపడుతుందని సూచించారు. సరైన ఆధారాలతోనే వ్యాక్సిన్‌ గడువుపై కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుందని వివరించారు.

క్షేత్ర స్థాయిలో ఫలితాలను బట్టి కొవిషీల్డ్‌ డోసుల మధ్య గడువును తగ్గించే నిర్ణయాలు తీసుకుంటున్నట్లు మరో ఇమ్యూనాలజిస్ట్‌ వినీతా బాల్‌ పేర్నొన్నారు. అలా ఇవ్వడం వల్ల వైరస్‌ రకాలను ఎదుర్కోవచ్చనడంపై ఇప్పుడే ఏమీ చెప్పలేమన్నారు. సరపడా డోసులు ఉన్న సమయంలో ముందుగా నిర్ణయించిన ప్రకారమే ఇవ్వవచ్చన్నారు. కానీ, వ్యాక్సిన్‌ కొరత సమయంలో ఎక్కువ మందికి వ్యాక్సిన్‌ చేరేలా గడువు పెంచడం వంటి చర్యలు సమర్థనీయమేని తెలిపారు. వ్యాక్సిన్‌ తీసుకున్న కొంత కాలానికి రోగనిరోధక ప్రతిస్పందనలు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ 12 వారాల తర్వాత రెండో డోసు ఇవ్వడం వల్ల వ్యాక్సిన్‌ (బూస్టర్‌) ప్రభావాన్ని పొందవచ్చని వినీతా బాల్‌ పేర్కొన్నారు. వివిధ క్లినికల్‌ ట్రయల్స్‌లోనూ ఈ విషయం తేలిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు.

ఇక ఆస్ట్రాజెనెకా తొలి డోసు తీసుకున్న దాదాపు 3నెలల వ్యవధి తర్వాత రెండో డోసు తీసుకోవడం వల్ల వ్యాక్సిన్‌ సమర్థవంతంగా పనిచేస్తుందని ది లాన్సెట్‌ నివేదిక వెల్లడించింది. వ్యాక్సిన్‌ కొరత ఏర్పడిన సమయంలో ఎక్కువ మందికి ప్రయోజనం చేకూర్చే విధంగా వ్యాక్సిన్‌ పంపిణీ విధానంలో మార్పులు చేసుకోవచ్చని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ ఆండ్రూ పొలార్డ్‌ ఆ నివేదికలో పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ లభ్యతను బట్టి ఆ వ్యవధిని కుదించుకోవచ్చని సూచించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని