West Bengal: భాజపా ఎంపీ ఇంటిపై బాంబు దాడి.. వారంలో ఇది రెండోసారి!

తాజా వార్తలు

Published : 14/09/2021 16:27 IST

West Bengal: భాజపా ఎంపీ ఇంటిపై బాంబు దాడి.. వారంలో ఇది రెండోసారి!

కోల్‌కతా: మరికొద్ది రోజుల్లో ఉప ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. భాజపా నాయకుడు, బైరక్‌పుర్‌ లోక్‌సభ సభ్యుడు అర్జున్‌సింగ్ నివాసంపైకి మంగళవారం కొందరు ఆగంతకులు బాంబులు విసిరారు. ఎంపీ ఇంటిపై బాంబు దాడి జరగడం వారం వ్యవధిలో ఇది రెండోసారి కావడం గమనార్హం. 

మంగళవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో కొందరు వ్యక్తులు కోల్‌కతాలోని ఎంపీ ఇంటి వెనుకవైపు బాంబులు విసిరినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇంటి వెనుక భాగం కొంతమేర ధ్వంసమైంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ రికార్డులను పరిశీలిస్తున్నారు. బాంబు పేలుడుకు సంబంధించిన దృశ్యాలను ఎంపీ అర్జున్‌ సింగ్‌ తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. 

కాగా.. సెప్టెంబరు 8న కూడా కొంతమంది దుండగులు బైక్‌లపై వచ్చి బాంబులు విసిరిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఆ మరుసటి రోజే మళ్లీ బాంబు దాడి జరగడం కలకలం సృష్టిస్తోంది. తృణమూల్‌ కార్యకర్తలే తనపై దాడి చేయిస్తున్నారని ఎంపీ అర్జున్‌ సింగ్‌ ఆరోపించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీచేస్తున్న భవానీపుర్‌ నియోజకవర్గానికి ఎన్నికల బాధ్యుడిగా భాజపా అధిష్ఠానం తనను నియమించిందని, అందువల్లే టీఎంసీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయని దుయ్యబట్టారు. ‘‘ఇదంతా కుట్ర ప్రకారమే జరుగుతోంది. దాడులకు కారణం టీఎంసీనే. నన్ను, నా కుటుంబాన్ని చంపేందుకు వారు కుట్రలు పన్నుతున్నారు. బెంగాల్‌లో గూండారాజ్‌ నెలకొంది’’ అని మండిపడ్డారు. అయితే ఈ ఆరోపణలను అధికార టీఎంసీ పార్టీ ఖండించింది.  



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని