the Taliban weapons: బైడెన్‌ సమర్పణలో.. ‘హాలీవుడ్‌ తాలిబన్‌’..!

తాజా వార్తలు

Published : 30/08/2021 01:19 IST

the Taliban weapons: బైడెన్‌ సమర్పణలో.. ‘హాలీవుడ్‌ తాలిబన్‌’..!

 167 విమానాలతో ముష్కరమూక బలోపేతం

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

తాలిబన్లు కాబుల్‌లో అడుగు పెట్టినప్పటి నుంచి ‘మేము మారాం..’ ‘ఇది పాత తాలిబన్‌ కాదు.. సరికొత్త తాలిబన్‌’.. ‘మా గత తప్పుల నుంచి నేర్చుకొన్నాం’ అంటూ అదే పనిగా చెబుతున్నారు. కానీ, కాబుల్‌ వీధుల్లో వారి సైనికులు సాధారణ ప్రజలపై చేస్తున్న దౌర్జన్యాలు చూస్తూ.. వారి ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదని తెలిసిపోతోంది. ఒక్క చోట మాత్రం స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. అది ఆయుధాల్లో..!  

అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్‌ నిర్ణయాలతో తాలిబన్లు మరింత శక్తిమంతులుగా మారారు. ఈసారి వారు ఎక్కడైనా ట్విన్‌ టవర్ల తరహా దాడి చేసినా వారిని అంత తేలిగ్గా అధికారం నుంచి తప్పించలేరు. ఇప్పుడు వారి వద్ద సుమారు 167 హెలికాప్టర్లు, విమానాలు ఉన్నట్లు తేలింది. ఇవి ఉపగ్రహ చిత్రాల ఆధారంగా ధ్రువీకరించిన లెక్క. ఇక హ్యాంగర్లలో ఉన్న వాటి లెక్క తెలియదు. 

తాలిబన్‌ చేతికి వచ్చిన వాటిల్లో  ఎండీ 530 హెలికాప్టర్లు (33), యూహెచ్‌-60 బ్లాక్‌ హాక్‌ హెలికాప్టర్లు (33),ఎంఐ-17 హెలికాప్టర్లు (32) ఉన్నాయి. ఇక ఏసీ 208 విమానాలు, ఏ-29 తేలికపాటి యుద్ధవిమానం, సీ-130 హెర్క్యూలెస్‌ రకం మూడు విమానాలు ఉన్నాయి. వీటిల్లో కొన్ని కాందహార్‌ విమానాశ్రయంలో ఉండగా.. మరికొన్ని ఉజ్బెకిస్థాన్‌లో తర్మీజ్‌ ఎయిర్‌ బేస్‌లో ఉన్నాయి.  

సీ-130 రవాణా విమానాలు భారీగా ఉంటాయి. సాధారణంగా బలగాలు, ఆయుధాల రవాణాకు వాడుతుంటారు. గతంలో ఈ రకం విమానాలను పాకిస్థాన్‌ బాంబర్ల వలే మార్చింది. 1965లో భారత్‌-పాక్‌ యుద్ధంలో మన దేశంపై దాడికి వీటిని వాడింది. ప్రత్యర్థులపై భారీ బాంబులను జారవిడిచేందుకు వీటిని వాడే అవకాశం ఉంది. వైమానిక శక్తిని సమర్థంగా వినియోగించుకోవాలంటే మంచి శిక్షణ ఉండాలి. ఇప్పటికైతే తాలిబన్లకు అది లేదు. 

గుట్టలుగా తుపాకులు..

మొదట్లో చాలా దాడుల్లో తాలిబన్ల వద్ద కేవలం బైకులు, సైకిళ్లు మాత్రమే ఉన్నాయి. కానీ, చివరికి వచ్చేసరికి వారికి వేలకొద్దీ వాహనాలు దొరికాయి. 
2003-16 మధ్యలో అమెరికా భారీ సంఖ్యలో అత్యాధునిక ఆయుధాలను అఫ్గానిస్థాన్‌కు తరలించింది. వీటిల్లో 3,58,530 వివిధ రకాల తుపాకులు ఉన్నాయి. 64వేల మిషీన్‌ గన్లు, 25,327 గ్రనేడ్‌ లాంచర్లు, 22,174 హమ్వి వాహనాలు ఉన్నాయి. 2014లో నాటో దళాలు అఫ్గాన్‌ రక్షణ బాధ్యతలను ఆ దేశ సైన్యానికి అప్పజెప్పేశాయి. ఈ క్రమంలో మరిన్ని ఆయుధాలను అక్కడకు చేర్చింది.  2017-21 మధ్యలో 20 వేల ఎం16 రైఫిల్స్‌, ఆ తర్వాత 3,598 ఎం4 రైఫిల్స్‌ వీటిలో ఉన్నాయి. మరో 3,012 హమ్విలను తరలించింది.

‘బద్రి 313’ ఫొటోలకు పోజులు..!

తాలిబన్లు  తయారు చేసిన అతి శక్తిమంతమైన దళం పేరు బద్రి 313 ఫోర్స్‌. 1,400 ఏళ్ల క్రితం  జరిగిన ‘బ్యాటిల్‌ ఆఫ్‌ బదర్‌’ పేరుతో  తాలిబన్లు దీనిని ఏర్పాటు చేశారు. అమెరికా నుంచి చేజిక్కించుకొన్న ఆయుధాలు, ఇతర రక్షణ కవచాలు వీరి వద్దకు చేరాయి. కాబుల్‌ వీరి అధీనంలోనే ఉంది. సైన్యం వలే యూనిఫామ్‌, బూట్లు, టాక్టికల్‌ రేడియో, బాడీ ఆర్మర్‌, టాక్టికల్‌ నీ-ప్యాడ్స్‌, హమ్వి వాహనాలను వాడుతూ కనిపించారు. ఇవన్నీ అమెరికన్లు వదిలేసిన ఆయుధాలే. వీరి వద్ద నైట్‌ విజన్‌ కళ్లజోళ్లు కూడా ఉన్నాయి. హాలీవుడ్‌ చిత్రాల తరహాలో వీడియోలు, ఫొటోలను తీయించి తాలిబన్లు ప్రచారానికి వాడుకొంటున్నారు.  

ఎంత వరకు ఉపయోగపడతాయి..

అమెరికా ఆయుధాలను తాలిబన్లు తేలిగ్గానే స్వాధీనం చేసుకొన్నారు. కానీ, వీటి వినియోగం, నిర్వహణ మాత్రం వారికి భారంగా మారుతుంది. అమెరికా దళాలు అఫ్గాన్‌ సైన్యానికి తగిన శిక్షణ ఇచ్చి సమకూర్చిన ఆయుధాలనే వారు  వాడలేకపోయారు.. ఇక ఎటువంటి శిక్షణ లేకుండా తాలిబన్లను వాటిని ఎలా వాడతారనేది ప్రశ్నార్థకమే. ముఖ్యంగా విమానాలు, హెలికాప్టర్ల వినియోగం కష్టం. ఒక వేళ వాడినా.. వాటి విడిభాగాలు, ఇతర సర్వీసింగ్‌లను సకాలంలో చేపట్టకపోతే త్వరగా మూలనపడతాయి. ఇప్పటి వరకు అమెరికా కాంట్రాక్టర్లు ఈ విమానాల నిర్వహణ చూసుకొన్నారు. వారు తాలిబన్ల ఆక్రమణకు ముందే దేశాన్ని వీడారు. దీంతో పాక్‌, చైనా, రష్యా వంటి దేశాలపై తాలిబన్లు వీటి నిర్వహణ కోసం ఆధారపడాల్సి ఉంటుంది. హమ్విలు, ఇతర సాయుధ వాహనాలను మాత్రం తాలిబన్లు యథేచ్ఛగా వాడుకొనే అవకాశం ఉంది.  


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని