ట్రంప్‌ ‘గోడ’కు బైడెన్‌ బ్రేక్‌

తాజా వార్తలు

Updated : 20/01/2021 20:03 IST

ట్రంప్‌ ‘గోడ’కు బైడెన్‌ బ్రేక్‌

తొలి రోజే 15 కీలక ఉత్తర్వులపై సంతకాలు

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాలో మరికొద్ది గంటల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. అక్కడి కాలమానం ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత డెమొక్రాటిక్‌ నేత జో బైడెన్‌ 46వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే అధికారంలోకి వచ్చీ రాగానే బైడెన్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. తొలి రోజే 15 కీలక ఉత్తర్వులపై సంతకాలు చేయనున్నారు. వీటిలో చాలా వరకు ట్రంప్‌ తీసుకొచ్చిన విధానాలకు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నవే కావడం గమనార్హం. 

మెక్సికో నుంచి అక్రమ చొరబాట్లను ఆపేందుకు ట్రంప్‌ ఆ సరిహద్దుల్లో గోడను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ట్రంప్‌ మానసపుత్రికగా పిలిచే ఈ ప్రాజెక్టుకు బైడెన్‌ చెక్‌ పెట్టనున్నారు. గోడ నిర్మాణాన్ని నిలిపివేస్తూ బైడెన్‌ తొలి రోజే ఉత్తర్వులు జారీ చేయనున్నారు. ఇక దీంతో పాటు పలు ముస్లిం దేశాలకు చెందిన పౌరులు అమెరికాలో పర్యటించకుండా ట్రంప్‌ గతంలో నిషేధం విధించారు. ఈ నిషేధాన్ని బైడెన్‌ ఎత్తివేయనున్నారు. 

ట్రంప్‌ నో అన్నవాటిని..

అమెరికాలో కరోనా విజృంభిస్తున్నా.. ట్రంప్‌ మాత్రం దాన్ని చాలాసార్లు తక్కువ చేసి మాట్లాడారు. మాస్క్‌లు పెట్టుకోవాల్సిన అవసరం లేదని బహిరంగంగానే చెప్పారు. అయితే ఇప్పుడు బైడెన్‌ అధికారంలోకి రాగానే.. దీనిపై కఠిన నిర్ణయం తీసుకోనున్నారు. వైరస్‌ వ్యాప్తి నిరోధానికి 100 రోజుల పాటు మాస్క్‌లు తప్పనిసరిగా పెట్టుకునేలా ఆదేశాలివ్వనున్నారు. ఇక పారిస్‌ పర్యావరణ ఒప్పందం, ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)ల నుంచి వైదొలుగుతూ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయాలను కూడా బైడెన్‌ మార్చనున్నారట. అధికారంలోకి రాగానే.. అమెరికాను మళ్లీ పారిస్‌ పర్యావరణ ఒప్పందం, డబ్ల్యూహెచ్‌ఓల్లో భాగస్వామిని చేసే ఉత్తర్వులపై సంతకాలు చేయనున్నట్లు తెలిసింది.

ఇవేగాక.. వలస విధానం, వీసాలు, ఆర్థిక వృద్ధి ఊతానికి కూడా బైడెన్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. మొత్తానికి బైడెన్‌ వచ్చాక.. అగ్రరాజ్యంలో భారీ మార్పులే జరగనున్నాయి. 

ఇవీ చదవండి..

వలసదారులకు ఊరట! 

బంధం ముడేసే బైడెన్‌ బృందం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని