భారత్‌ బంద్‌.. స్తంభించిన ఉత్తరభారతం

తాజా వార్తలు

Updated : 26/03/2021 15:14 IST

భారత్‌ బంద్‌.. స్తంభించిన ఉత్తరభారతం

దిల్లీ/చండీగఢ్‌: కేంద్రం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా గత నాలుగు నెలలుగా దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులు శుక్రవారం సంపూర్ణ భారత్‌ బంద్‌ చేపట్టారు. ఉదయం ఆరు గంటలకు మొదలైన ఈ బంద్‌ నేపథ్యంలో ఉత్తరభారతంలోని పలు రాష్ట్రాల్లో రవాణా స్తంభించింది. రైతు మద్దతుదారులు రోడ్లపై బైఠాయించి నిరసనకు దిగారు.

దిల్లీ-ఉత్తరప్రదేశ్‌ను కలిపే ఘాజిపూర్‌ సరిహద్దు వద్ద సంయుక్త కిసాన్‌ మోర్చా నాయకులు ఆందోళన చేపట్టారు. రోడ్లపై నృత్యాలు చేస్తూ నిరసన తెలియజేశారు. దీంతో 24వ నంబరు జాతీయరహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బంద్‌ దృష్ట్యా ఈ మార్గంలో వాహనాల రాకపోకలకు నిలిపివేసినట్లు దిల్లీ ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. అటు పంజాబ్‌, హరియాణాల్లోనూ బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. అమృత్‌సర్‌లో రైతు మద్దతుదారులు రైల్వే ట్రాక్‌పై బైఠాయించి నిరసన చేపట్టారు. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. బంద్‌ నేపథ్యంలో నాలుగు శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేసినట్లు రైల్వేశాఖ వెల్లడించింది. పంజాబ్‌, హరియాణాలోని 32 ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు తెలిపింది.

సరిహద్దుల్లో భారీ భద్రత

భారత్‌ బంద్‌ దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా దిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. రైతులు ఆందోళన చేస్తున్న సింఘు, టిక్రీ, ఘాజిపూర్‌ సరిహద్దుల్లో భద్రతాబలగాలను భారీగా మోహరించారు. రద్దీ ప్రదేశాల్లో గస్తీ‌ నిర్వహించనున్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలకు నాలుగు నెలలు పూర్తవుతున్న సందర్భంగా రైతు సంఘాలు ఈ బంద్‌కు పిలుపునిచ్చాయి. సాయంత్రం 6 గంటల వరకు బంద్‌ సాగనుంది.

రాహుల్‌ మద్దతు..

రైతులు చేపట్టిన భారత్‌ బంద్‌కు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ మద్దతు పలికారు. ‘‘సత్యాగ్రహాలతో దాడులు, అన్యాయం, అహంకారాన్ని అంతం చేయొచ్చని దేశ చరిత్ర చెబుతోంది. నేడు జాతిహితం కోసం రైతులు చేపట్టిన ఆందోళన శాంతియుతంగా కొనసాగాలి’’ అని రాహుల్‌ హిందీలో ట్వీట్‌ చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని