ట్రంప్‌కు కరోనా.. చైనా ఎగతాళి..!

తాజా వార్తలు

Updated : 02/10/2020 18:50 IST

ట్రంప్‌కు కరోనా.. చైనా ఎగతాళి..!

ట్రంప్‌ దంపతులు తగిన మూల్యం చెల్లించారు: గ్లోబల్‌ టైమ్స్‌

దిల్లీ: ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన దేశం అమెరికా ఇప్పటికే కరోనా వైరస్‌ ధాటికి వణికిపోతోంది. తాజాగా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దంపతులకు వైరస్‌ సోకినట్లు తేలడంతో యావత్ ప్రపంచం ఆశ్చర్యానికి గురయ్యింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా సామాన్యుల నుంచి దేశాధినేతల వరకు స్పందిస్తున్నారు. వైరస్‌ బారినపడినట్లు ట్రంప్‌ చేసిన ప్రకటనపై కొందరు ఆశ్చర్యం, సానుభూతి వ్యక్తం చేస్తుండగా మరికొందరు మాత్రం ఎగతాళి చేయడం కనిపిస్తోంది. ముఖ్యంగా తమపై ప్రతీకార చర్యలకు పాల్పడుతోన్న ట్రంప్‌కు వైరస్‌ సోకడంతో‌ ఆయనపై కామెంట్లు చేసేందుకు చైనీయులు మాత్రం తాపత్రయపడుతున్నారు.

మార్కెట్లు డీలా..!

బలమైన ఆర్థికవ్యవస్థ కలిగిన అగ్రరాజ్య అధ్యక్షుడికి వైరస్‌ సోకడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ విషయం తెలియగానే తొలుత ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టాక్‌ మార్కెట్లన్నీ డీలా పడ్డాయి. ఆందోళనకు గురైన మదుపరులు తమ పెట్టుబడులపై ఆచితూచి వ్యవహరించారు. దీంతో స్టాక్‌ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. అమెరికాతోపాటు ఆసియా మార్కెట్లు కూడా నష్టాలవైపు పరుగు తీశాయి. అంతేకాకుండా ఆయిల్‌ ధరలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. అటు జపాన్‌, ఆస్ట్రేలియా మార్కెట్లపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. అమెరికా ఎన్నికల ముందు ఇది ఊహించని పరిణామమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

చైనా ఎగతాళి..!

ట్రంప్‌ దంపతులకు వైరస్‌ సోకిన విషయాన్ని చైనా అధికారిక మీడియా కూడా ప్రసారం చేసింది. ఇక చైనా వార్తాపత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ మరింత ముందుకెళ్లింది. ‘కరోనా వైరస్‌ పరిస్థితిని తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేసినందుకు ట్రంప్‌ దంపతులు తగిన మూల్యం చెల్లించారు’ అని పత్రికా సంపాదకుడు హూ షీజిన్ ట్విటర్‌లో పేర్కొన్నారు. అమెరికాలో కరోనా పరిస్థితి ఎలా ఉందనే దానికి ఈ వార్త అద్దం పడుతోందన్నారు. ఇది అమెరికాపైనే కాకుండా ట్రంప్‌కు వ్యక్తిగతంగానూ, త్వరలో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఆయన గెలుపుపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని షీజిన్ అభిప్రాయపడ్డారు. అక్కడి మీడియానే కాకుండా చైనీయులు కూడా ట్రంప్‌కు కరోనా సోకడంపై భారీగా స్పందిస్తున్నారు. అక్కడ ఎక్కువగా ఉపయోగించే సామాజిక మాధ్యమం వీబో యాప్‌లో ఈ వార్తకోసమే ఎక్కువగా వెతకడంతోపాటు ట్రంప్‌ను ఎగతాళి చేస్తూ కామెంట్లు చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడిస్తున్నాయి. అయితే చైనా ప్రభుత్వం మాత్రం ట్రంప్‌కు కరోనా సోకిన విషయంపై అధికారికంగా స్పందించలేదు.

ప్రపంచదేశాలు ఏమన్నాయంటే..?

ఇదిలాఉంటే, వైరస్‌ బారినపడినట్లు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించగానే భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. మిత్రుడు ట్రంప్‌, ఆయన సతీమణి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ట్రంప్‌కు వైరస్‌ సోకడంపై ఆస్ట్రేలియా కూడా స్పందించింది. ట్రంప్‌ దంపతులు త్వరగా కోలుకోవాలని ఆస్ట్రేలియా వ్యవసాయశాఖ మంత్రి, కన్జర్వేటివ్‌ నేషనల్స్‌ పార్టీ ఉపనేత డేవిడ్‌ లిటిల్‌ప్రౌడ్‌ ప్రార్థించారు. అయితే, ఈ వైరస్‌ నుంచి ఎవరూ తప్పించుకోలేరనే విషయాన్ని ఇది తేటతెల్లంచేస్తోందని.. ముందుజాగ్రత్తలు తీసుకున్నా కూడా వైరస్‌ బారినపడే అవకాశాలున్నాయని లిటిల్‌ప్రౌడ్‌ స్పష్టంచేశారు. ట్రంప్‌ మాస్కు ధరించకపోవడాన్ని టోక్యో గవర్నర్‌ను విలేకర్లు ప్రశ్నించగా, ఆమె నేరుగా దీనిపై స్పందించలేదు. జపాన్‌లో మాత్రం విస్తృతంగా మాస్కులు ధరిస్తున్నామని ట్రంప్‌ ప్రస్తావన లేకుండానే ఆమె బదులిచ్చారు. మరికొందరు జపనీయులు మాత్రం డిస్‌ఇన్ఫెక్షన్లపై ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేసుకుంటూ వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. ఇరాన్‌ వార్తా సంస్థలు కూడా ట్రంప్‌కు వైరస్‌ సోకిన విషయాన్ని వ్యంగ్య చిత్రాలతో ప్రసారం చేశాయి. ఇక చైనా, జపాన్‌, దక్షిణ కొరియా, తైవాన్‌తో పాటు అంతర్జాతీయ మీడియా ట్రంప్‌కు కరోనా సోకిన విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించాయి.

యావత్‌ ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కరోనా వైరస్‌కు చైనానే కారణమంటూ తొలినుంచి డొనాల్డ్‌ ట్రంప్‌ ఆరోపిస్తూనే ఉన్నారు. అంతేకాకుండా చాలా సందర్భాల్లో దాన్ని చైనా వైరస్‌గానే అభివర్ణించారు. దీనికి చైనా బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమయంలో ప్రపంచ ఆరోగ్యసంస్థ తీరుపై కూడా ట్రంప్‌ మండిపడ్డారు. వ్యక్తిగతంగా మాస్కు ధరించే విషయంలోనూ ట్రంప్‌ మొండిగానే వ్యవహరించారు. ఈ సమయంలో చివరకు ట్రంప్‌కు వైరస్‌ సోకింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చైనా తీరుపై మరోసారి ట్రంప్‌ స్పందిస్తారా? లేక ఎన్నికలు దగ్గరపడుతోన్న సమయంలో క్వారంటైన్‌లోనే ఉండి ఎన్నికల వ్యూహరచనల్లో నిమగ్నమవుతారా? అనే విషయంపై ఆసక్తి నెలకొంది.

ఇదీ చదవండి..

ట్రంప్‌ దంపతులకు కరోనా పాజిటివ్‌


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని