కమలా హ్యారిస్‌‌.. ‘మహిళా ఒబామా’..!

తాజా వార్తలు

Updated : 12/08/2020 20:54 IST

కమలా హ్యారిస్‌‌.. ‘మహిళా ఒబామా’..!

ట్రంప్‌ విధానాలపై ఎలుగెత్తే ధైర్యం
తొలి నల్లజాతీయురాలిగా ఉపాధ్యక్ష పోటీకి సిద్ధం

న్యూయార్క్‌: అగ్రరాజ్యం అమెరికా రాజకీయాల్లో నల్లజాతీయులు చక్రం తిప్పడం సాధారణమే అయినప్పటికీ కీలకస్థానాల్లో ఉండటం మాత్రం అరుదనే చెప్పొచ్చు. ముఖ్యంగా అధ్యక్ష, ఉపాధ్యక్షుల వంటి పదవుల్లో కొనసాగడమంటే భిన్నజాతుల వారిని తమ శక్తియుక్తులతో ఒప్పించడమే. అలాంటి చాతుర్యంతోనే ఇప్పటికే నల్లజాతీయుడైన బరాక్‌ ఒబామా అగ్రరాజ్యానికి వరుసగా రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా కొనసాగారు. ఇలాంటి కీలక స్థానాల్లో ఒకటైన ఉపాధ్యక్ష పదవికి పోటీచేసేందుకు భారత సంతతి మహిళ కమలా హ్యారిస్‌కు తొలిసారి అవకాశం దక్కింది. అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డెమొక్రటిక్‌ అభ్యర్థి జో బిడెన్.. ఉపాధ్యక్ష రేసులో కమలా హ్యారిస్‌ను ఎంచుకున్నారు. ఆఫ్రికన్-అమెరికన్‌గా స్థిరపడినప్పటికీ భారతీయ మూలాలున్న హ్యారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలిగా గెలిస్తే మాత్రం చరిత్ర తిరగరాయడమే అని చెప్పొచ్చు.

అమెరికా వలస విధానాలపై ట్రంప్‌ తనదైన శైలిలో స్పందిస్తూ వలసలపై తన వ్యతిరేకతను చాటుతూనే ఉన్నారు. గత ప్రభుత్వాలు అనుసరించిన వలస విధానాలను సమూలంగా మార్చేస్తానంటూ ఆయన తరచూ హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఒబామా పాలనా కాలంలో తీసుకున్న వలస విధానాలను ట్రంప్ వ్యతిరేకిస్తున్నారు. అదే సమయంలో డొనాల్డ్‌ ట్రంప్‌ విధానాలపై కమలా హ్యారిస్‌ తనదైన గళాన్ని వినిపిస్తూ వస్తున్నారు. బరాక్ ఒబామా భావాలు కలిగిన నేత ఉపాధ్యక్ష పదవికి పోటీచేయడం కీలక పరిణామమేనని చెప్పొచ్చు. ముఖ్యంగా అమెరికా ఎన్నికల్లో ఎంతో కీలకంగా వ్యవహరించే భారత్‌, ఆఫ్రికా దేశీయుల మద్దతు, వలస విధానాలపై ఆమెకున్న ఆలోచనలు కమలా హ్యారిస్‌కు కలిసొచ్చే అంశమని నిపుణులు అంటున్నారు.

భారత మూలాలు.. 

చెన్నైకి చెందిన శ్యామలా గోపాలన్‌, జమైకాకు చెందిన డొనాల్డ్‌ హ్యారిస్‌ కుమార్తె కమలా హ్యారిస్‌. తల్లిదండ్రులు విడాకుల అనంతరం అమెరికాలోనే స్థిరపడిన తల్లి శ్యామలా గోపాలన్‌ చెంతనే కమలా హ్యారిస్‌ ఉంటున్నారు. తనతోపాటు తన సోదరి మాయకు భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని అమ్మ శ్యామలా గోపాలన్‌ వివరించేదని హ్యారిస్‌ గొప్పగా చెబుతుంటారు.

❏ చిన్నతనంలో చెన్నై బీచ్‌లో తాతగారితో తిరిగిన సంఘటనలను, మధుర జ్ఞాపకాలను నెమరువేసుకుంటానని కమలా హ్యారిస్‌ ఈ మధ్యే మీడియా ముందు చెప్పారు.

ప్రశ్నించేతత్వం, హక్కులపై పోరాటాలు కూడా తన కుటుంబ ప్రభావమేనని గర్వంగా చెప్పుకుంటారు కమలా హ్యారిస్‌.

ప్రస్తుతం అమెరికాలోని కాలిఫోర్నియాకు సెనేటర్‌గా ఉన్న  55 ఏళ్ల కమలా హ్యారిస్‌.. న్యాయవాద వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన బరాక్‌ ఒబామా నుంచి మన్ననలు పొందారు.

❏ శాన్‌ ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్‌ అటార్నీగా కూడా కమలా హ్యారిస్‌ వ్యవహరించారు. చీఫ్ ప్రాసిక్యూటర్ స్థాయిలో కొనసాగిన తొలి మహిళగా కమలా హ్యారిస్‌ చరిత్ర సృష్టించారు. అంతేకాకుండా ఆఫ్రికన్‌-అమెరికన్‌, భారత సంతతికి చెందిన ఓవ్యక్తి డిస్ట్రిక్ట్‌ అటార్నీగా ఉండడం కూడా అదే తొలిసారి.

ఈ ఎన్నికల్లో కమలా హ్యారిస్‌ గెలిస్తే మాత్రం అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా కీర్తి గడించనున్నారు. అంతేకాకుండా తొలి ఇండియన్‌-అమెరికన్‌, ఆఫ్రికన్‌గా చరిత్ర సృష్టించనున్నారు.

❏ ట్రంప్‌ను ఓడించే లక్ష్యంగా జో బిడెన్‌తో కలిసి కమలా హ్యారిస్‌ ప్రచారంలో దూసుకెళ్తున్నారు.

ఇవీ చదవండి..
భారత సంతతి మహిళకు అత్యున్నత గౌరవం

ట్రంప్‌ వలసల నిషేధంతో భారత్‌పై ప్రభావమెంత?


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని