Covid: మూడో ముప్పు ముంచుకొస్తోంది..!

తాజా వార్తలు

Updated : 21/07/2021 15:02 IST

Covid: మూడో ముప్పు ముంచుకొస్తోంది..!

కొన్ని రాష్ట్రాల్లో అప్పుడే సంకేతాలు..

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

భారత్‌లో కొవిడ్‌ మూడో దశ ముప్పు వేగంగా ముంచుకొస్తోంది. కేసుల తగ్గుదల వేగం బాగా మందగించింది. ఒక రోజు కొత్త కేసులు తగ్గినా.. మరో రోజు పెరుగుతున్నాయి. నిన్న 30వేలకు పడిపోయిన కొత్త కేసులు.. నేడు 42 వేలకు పెరిగాయి.  కొన్ని రోజులుగా కొత్త కేసుల కంటే రికవరీలు తక్కువగా ఉండటం ఆందోళనకరంగా మారింది. ఇవన్నీ ప్రమాద ఘంటికలే. వైరస్‌ వ్యాధులు పలు విడతలుగా మానవాళిపై దాడులు చేయడం సహజమే. 1918లో స్పానిష్‌ ఫ్లూ కూడా పలు విడతలుగా వ్యాపించింది. కొవిడ్‌ కూడా ఇప్పటికే భారత్‌లో రెండు దశల్లో వ్యాపించింది. సెకండ్‌ వేవ్‌లో అయితే.. దేశం మొత్తం చిగురుటాకులా వణికిపోయింది. వ్యాక్సినేషన్‌ భారీ ఎత్తున చేపట్టిన బ్రిటన్‌ వంటి చోట్ల ఇప్పుడు థర్డ్‌ వేవ్‌ సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒక్కవారంలో 40శాతం కేసులు పెరిగాయి.

భారత్‌లో పరిస్థితి ఏమిటీ..?

మన దేశంలో కూడా కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. కేరళలో థర్డ్‌వేవ్‌ మొదలైందనే అనుమానాలు బలపడుతున్నాయి. మహారాష్ట్రలో కూడా రోజువారీ కేసుల సంఖ్యలో భారీ పెరుగుదల కనిపించింది. ఈ రాష్ట్రాల్లో రోజువారీ కేసులు 8వేల నుంచి 10వేల మధ్యలో నమోదవుతున్నాయి. ఫస్ట్‌వేవ్‌, సెకండ్‌ వేవ్‌లలో కూడా ఈ రాష్ట్రాలు దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్నాయి. కేరళలో కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ను పూర్తిగా వదిలేయడం ప్రమాదకరంగా మారిందని ఎపిడమాలజిస్టులు పేర్కొంటున్నారు. దీంతో కుటుంబంలో ఒకరి నుంచి మిగిలిన అందరికి వ్యాధి సోకే ప్రమాదం ఉందని చెబుతున్నారు. థర్డ్‌వేవ్‌ విషయం మరో 15-21 రోజుల్లో స్పష్టంగా తెలిసిపోతుందంటున్నారు. 

దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో మాత్రం సెకండ్‌ వేవ్‌లో కేసులు ఏ విధంగా పెరిగాయో.. అలాంటి ట్రెండే థర్డ్‌వేవ్‌లో కూడా కనిపించవచ్చని అంచనా వేస్తున్నారు. మిగిలిన శ్వాస సంబంధిత వైరస్‌ల వలే కరోనా కూడా శీతాకాలం ప్రారంభంలో వేగంగా వ్యాపించే అవకాశం ఉందని చెబుతున్నారు. 

భారీగా కేసులు పెరిగే ప్రమాదం ఉందా..?

గతంలో వచ్చిన స్పానిష్‌ ఫ్లూ థర్డ్‌ వేవ్‌ను పరిశీలించి అంచనాకు వస్తే మాత్రం సెకండ్‌ వేవ్‌తో పోలిస్తే తీవ్రత కాస్త తగ్గవచ్చు. స్పానిష్‌ ఫ్లూ థర్డ్‌ వేవ్‌, ఫస్ట్‌వేవ్‌ దాదాపు ఒకేలా ఉన్నాయి. సెకండ్‌ వేవ్‌ మాత్రం ప్రళయాన్ని తలపించింది. కొవిడ్‌ విషయంలో ఇలా జరగవచ్చని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఫండమెంటల్‌ రీసెర్చ్‌ పరిశోధకులు భావిస్తున్నారు. రద్దీగా ఉండే ప్రధాన పట్టణాల్లోని ప్రజలు ఇప్పటికే కొవిడ్‌ ప్రభావానికి గురి కావడంతో వ్యాప్తి తీవ్రత తగ్గవచ్చు. దిల్లీలో దాదాపు 70శాతం మందిలో యాంటీబాడీలు కనిపిస్తున్నట్లు సిరో సర్వేలు చెబుతున్నాయి.  ముంబయిలో టీఐఎఫ్‌ఆర్‌ టీమ్‌ నిర్వహించిన సర్వేలో 80శాతం మంది వైరస్‌ ప్రభావానికి లోనైనట్లు గుర్తించారు. 

ఇప్పటికే బ్రెజిల్‌, కొలంబియా వంటి దేశాల్లో పలు విడతలుగా వైరస్‌ విజృంభించినట్లు గ్రాఫ్‌లు చెబుతున్నాయి. అమెరికా, యూకే వంటి చోట్ల కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కాకపోతే ఒక వేవ్‌కు మరో వేవ్‌కు మధ్య ఎంత తేడా ఉంటుందనేది స్థానిక పరిస్థితులు, నిబంధనలపై ఆధారపడి ఉంటుంది. 

జులై నాలుగో తేదీనే థర్డ్‌వేవ్‌ మొదలు..?

* కొన్నాళ్ల కిందట నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ మాట్లాడుతూ.. రానున్న రెండు,మూడు నెలలే థర్డ్‌వేవ్‌లో కీలకమని చెప్పారు. భారత్‌ హెర్డ్‌ఇమ్యూనిటీ సాధించడానికి చాలా దూరంలో ఉందని వెల్లడించారు. 

* హైదరాబాద్‌ విశ్వ విద్యాలయానికి చెందిన డాక్టర్‌ విపిన్‌ శ్రీవాస్తవ లెక్క ప్రకారం జులై 4వ తేదీనే భారత్‌లో థర్డ్‌వేవ్‌ మొదలైంది. ఫిబ్రవరి తొలినాళ్లలో సెకండ్‌ వేవ్‌ మొదలయ్యే సమయంలో కనిపించిన ట్రెండ్‌ మళ్లీ జులై 4వ తేదీన కనిపించింది. 

* ఐసీఎంఆర్‌ అంచనా ప్రకారం ఆగస్టు చివరి నాటికి థర్డ్‌వేవ్‌ భారత్‌లో స్పష్టంగా కనిపించనుంది. 

* ఇక యూబీఎస్‌ సెక్యూరిటీస్‌, ఎస్‌బీఐ రీసెర్చ్‌ బృందాలు కూడా ఆగస్టులో థర్డ్‌వేవ్‌కు సిద్ధంగా ఉండాలని హెచ్చరించాయి. 

* థర్డ్‌వేవ్‌ వచ్చేందుకు చాలా అవకాశాలున్నాయని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా పేర్కొన్నారు. రోగనిరోధక శక్తిని తప్పించుకొనే మ్యూటెంట్‌ వస్తే పరిస్థితి కష్టమే అని తెలిపారు. సెకండ్‌ వేవ్‌ను మించి కేసులు రావచ్చన్నారు.

* థర్డ్‌వేవ్‌ను అంచనా వేయడం కష్టమని కర్ణాటక కొవిడ్‌ నిపుణుల కమిటీ ఛైర్మన్‌ డాక్టర్‌ దేవీశెట్టి పేర్కొన్నారు. ప్రజలు కొవిడ్‌ నిబంధనలు వదిలేసి బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తిస్తే వారిని ప్రభుత్వాలు, మందులు, టీకాలు కూడా కాపాడలేవని చెప్పారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని