అందుకే ఆ విషయం దాచిపెట్టారు: ట్రంప్‌

తాజా వార్తలు

Published : 10/11/2020 10:14 IST

అందుకే ఆ విషయం దాచిపెట్టారు: ట్రంప్‌

కరోనా టీకా అభివృద్ధిపై అమెరికా అధ్యక్షుడి ఆరోపణలు

వాషింగ్టన్‌‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని అంగీకరించడానికి నిరాకరిస్తున్న డొనాల్డ్‌ ట్రంప్‌ విమర్శలకు మరింత పదునుపెట్టారు.  కొవిడ్‌-19 నివారణ కోసం ఫైజర్‌, బయో ఎన్‌ టెక్‌ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న టీకా సమర్థంగా పనిచేస్తోందన్న విషయాన్ని కావాలనే ఫైజర్‌, అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్‌డీఏ) దాచిపెట్టాయని ఆరోపించారు. టీకా అభివృద్ధికి తాను చేసిన కృషి ఎన్నికల్లో ఉపయోగపడకుండా ఉండేందుకు ఇలా చేశారని వ్యాఖ్యానించారు. ఒకవేళ బైడెనే అధ్యక్షుడై ఉంటే టీకా ఎప్పటికీ వచ్చి ఉండేది కాదని పేర్కొన్నారు. అలాగే ఎఫ్‌డీఏ సైతం ఉదాసీనంగా వ్యవహరించేదని.. ప్రజల ప్రాణాలను కాపాడడం కోసం అత్యవసర అనుమతులు ఇచ్చేదే కాదని ఆరోపించారు. వీరి వల్ల లక్షల మంది ప్రాణాలు కోల్పోయేవారని విమర్శించారు. రాజకీయాల కోసం కాకుండా ప్రజల ప్రాణాలు రక్షించడానికైనా ముందే ప్రకటించి ఉండాల్సిందన్నారు. 

బయో ఎన్‌ టెక్‌తో కలిసి తాము రూపొందిస్తున్న కరోనా టీకా 90 శాతం మేర సమర్థంగా పనిచేస్తోందని ఫైజర్‌ సంస్థ సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సాగుతున్న మూడో దశ ప్రయోగాల్లో ఈ మేరకు ప్రాథమికంగా వెల్లడైనట్లు రెండు సంస్థలు తెలిపాయి. ‘అత్యవసర వినియోగం’ కింద ఈ టీకాను అనుమతించాలని ఈ నెలాఖరులో ఎఫ్‌డీఏకు దరఖాస్తు చేసుకోనున్నట్లు పేర్కొన్నాయి. 

మీడియాను దూరంగా ఉంచాలి...
అలాగే ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోకుండా మీడియాను దూరంగా ఉంచాలని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ప్రధాన మీడియా సంస్థల పోల్స్‌ అన్నీ తప్పులతడకగా ఉన్నాయని ఆరోపించారు. దీంతో ఓటర్లను తప్పుదోవ పట్టించారన్నారు. అలాగే నిధుల సేకరణ సైతం తీవ్రంగా ప్రభావితమైందన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ నుంచి మీడియాను పూర్తిగా దూరంగా ఉంచాలన్నారు. అంచనాల పేరిట చాలా మీడియా సంస్థలు తనకు తక్కువ సీట్లు కట్టబెట్టాయని ఆరోపించారు. కుట్రలో భాగంగానే ఇదంతా జరిగిందన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని