ట్రంప్‌ను గద్దె దించాల్సిందే: ఒబామా

తాజా వార్తలు

Updated : 22/10/2020 12:22 IST

ట్రంప్‌ను గద్దె దించాల్సిందే: ఒబామా

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షపదవి నుంచి డొనాల్డ్‌ ట్రంప్‌ను ఎట్టిపరిస్థితుల్లో దింపాల్సిందేనని మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా అన్నారు. కరోనా విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఆయన చర్యల వల్ల ఎంతో మంది అమెరికా పౌరులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికాలో గత పరిస్థితులు తిరిగి రావాలంటే డెమొక్రాటిక్‌ అభ్యర్థి బైడెన్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రచారాలు హోరా హోరీగా సాగుతున్నాయి. డెమొక్రాటిక్‌ అధ్యక్ష అభ్యర్థి బైడన్‌, ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌కు మద్దతుగా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ప్రచారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫిలడెల్ఫియాలో నిర్వహించిన ర్యాలీలో ఒబామా ప్రసంగించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థను ఎలా చక్కదిద్దాలి?కరోనా విపత్కర పరిస్థితుల నుంచి ప్రజలను ఎలా గట్టెక్కించాలన్న దానిపై బైడన్‌, కమలా హారిస్‌లకు నిర్దిష్ట ప్రణాళికలు ఉన్నాయన్నారు. వారిద్దరూ అమెరికా ప్రభుత్వానికి పూర్వ వైభవం తీసుకొస్తారని తెలిపారు. ట్రంప్‌ చేపట్టిన ఆర్థిక చర్యలు మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్‌ను పోలి ఉన్నాయని చెబుతూ.. అప్పట్లో అమెరికా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైనట్లుగానే ఇప్పుడు కూడా ప్రతికూల ప్రభావం చూపించిందని వ్యాఖ్యానించారు. 

కరోనా నిబంధనలను కనీసం కూడా పాటించడం లేదని ఒబామా మండిపడ్డారు. ఇటు ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నా అధికార దాహంతో తన ప్రచార కార్యక్రమాల్లో ఇసుమంతైనా మార్పు చేయరని విమర్శించారు. ‘‘ఆయన ప్రజలకు దూరంగా స్టేజ్‌పైన ఉంటూ ప్రసంగిస్తారు. అంతకుమందు సిబ్బంది ఆ ప్రాంతాన్నంతా శుభ్రం చేస్తారు. కనీసం మాస్కు ధరించకుండానే మాట్లాడుతారు. ప్రసంగం పూర్తయిన తర్వాత మాత్రం ‘ఓట్‌ మాస్క్‌’ ధరించి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లిపోతారు. అక్కడికి వచ్చిన ప్రజలను దృష్టిలో ఉంచుకోరు’’ అని ఒబామా విమర్శించారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం వల్ల  ప్రజాసమస్యలు తీరిపోవని ఎద్దేవా చేశారు.

చైనా బ్యాంకులో అకౌంట్‌
తాజాగా వెల్లడైన వివరాల మేరకు ట్రంప్‌నకు చైనా బ్యాంకులో ఖాతా ఉందని ఒబామా అన్నారు. రహస్యంగా లావాదేవీలు జరుపుతున్నారని ఆరోపించారు. ఆయనకు అదెలా సాధ్యమైందని ప్రశ్నించారు. అసలు రహస్యంగా ఖాతాను తెరవాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. ఒకవేళ నాకే చైనాలో బ్యాంక్‌ అకౌంట్‌ ఉంటే రెండోసారి అధ్యక్షుడిగా అవకాశమిచ్చేవాళ్లా? అని ప్రజలను ప్రశ్నించారు. అధ్యక్షుడు ట్రంప్‌ అమెరికాను రక్షణకు కృషి చేయడం లేదని, తనను తాను రక్షించుకోవడానికి మాత్రమే చూస్తున్నారని ఆరోపించారు. అంతర్జాతీయ ఉగ్రవాది బిన్‌ లాడెన్‌ను అమెరికా నేవీ హతమార్చలేదని ట్రంప్‌ చెప్పడం వెనక ఆంతర్యమేమిటని ఒబామా మండిపడ్డారు. తాజా ఎన్నికలు ఎంతో కీలకమైనవిగా పేర్కొంటూ.. అమెరికా ప్రజలు 2016లో చేసిన తప్పును పునరావృతం చేయరని ఆశిస్తున్నట్లు చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని