సింగిల్‌ డోస్‌తోనే రక్షణ!

తాజా వార్తలు

Published : 02/12/2020 21:59 IST

సింగిల్‌ డోస్‌తోనే రక్షణ!

అభివృద్ధి చేస్తున్న బెల్జియం శాస్త్రవేత్తలు

లండన్‌: కరోనా వైరస్‌ మహమ్మారిని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్‌, ఔషధం కోసం ప్రపంచవ్యాప్తంగా కృషి జరుగుతోంది. ఇందులో భాగంగా ఎల్లో ఫీవర్‌ వ్యాక్సిన్‌ ఆధారంగా ఓ నూతన వ్యాక్సిన్‌ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. కేవలం ఒక్క డోసుతోనే కరోనా వైరస్‌ నుంచి రక్షణ కల్పిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. దీనిపై ఇప్పటికే ఎలుకలు, కోతులపై పరిశోధనలు జరుపగా.. రానున్న రోజుల్లో క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించేందుకు బెల్జియం శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు.

బెల్జియంలోని కేయూ ల్యూవెన్‌ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు సింగిల్‌ డోస్‌ ఇచ్చే విధంగా నూతన వ్యాక్సిన్‌ రూపకల్పనకు సిద్ధమయ్యారు. వ్యాక్సిన్‌ అభివృద్ధిలో భాగంగా, ప్రాణాంతక ఎల్లో ఫీవర్‌కు వాడే వ్యాక్సిన్‌లో సార్స్‌-కోవ్‌-2 వైరస్‌ స్సైక్‌ జెనెటిక్‌ కోడ్‌ను చేర్చారు. అనంతరం దీనికి ‘రెగా వ్యాక్స్’‌ అని నామకరణం చేశారు. ముందస్తు ప్రయోగాల్లో భాగంగా, వీటిని ఎలుకలు, కోతులపై ప్రయోగించారు. తాజాగా వీటికి సంబంధించిన పరిశోధన పత్రాన్ని ప్రచురించేందుకు నేచర్‌ జర్నల్‌ అనుమతించింది.

పరిశోధనల్లో భాగంగా, నూతనంగా అభివృద్ధిచేసిన వ్యాక్సిన్‌ను ఎలుకలకు ఇచ్చిన అనంతరం, వాటికి వైరస్‌ సోకేలా చేశారు. వ్యాక్సిన్‌ సింగిల్‌ డోసు ఇచ్చిన పదిరోజుల తర్వాత పరీక్షించగా.. అవి వైరస్‌ నుంచి రక్షణ పొందుతున్నట్లు గ్రహించారు. టీకా ఇచ్చిన మూడు వారాల అనంతరం అన్ని ఎలుకలు సురక్షితంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ సమయంలో వాటిలో ఎలాంటి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌ కూడా వృద్ధి చెందలేదని కనుగొన్నారు. తర్వాత ఈ టీకాను కోతులపైనా ప్రయోగించారు. ఒక డోసు ఇచ్చిన వారం రోజుల్లోనే వాటిలో యాంటీబాడీలు వృద్ధి చెందాయని.. 14రోజుల్లో ప్రయోగాల్లో పాల్గొన్న దాదాపు అన్ని కోతుల్లో యాంటీబాడీలు వృద్ధిచెందినట్లు గుర్తించారు.

ఇలా ఎల్లో ఫీవర్‌తో పాటు కరోనా వైరస్‌ను ఎదుర్కొనే వ్యాక్సిన్‌ను ఇప్పటివరకు తాము మాత్రమే అభివృద్ధి చేస్తున్నట్లు కేయూ ల్యూవెన్‌ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ జోహన్‌ నెయట్స్‌ వెల్లడించారు. జైకా, ఎబోలా, ర్యాబీస్‌లను ఎదుర్కొనే టీకాల్లోనూ ఎల్లో ఫీవర్‌కు వాడే టీకానే తాము ప్రామాణికంగా తీసుకున్నామని తెలిపారు. ‘ఎల్లో ఫీవర్‌కు వాడే వ్యాక్సిన్‌ను గడిచిన 80ఏళ్లుగా ఉపయోగిస్తున్నారు. ఇది సమర్థ, సురక్షిత వ్యాక్సిన్‌ అనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే దీన్ని 50కోట్ల మంది తీసుకున్నారు. కేవలం ఒక్క డోసుతోనే ఎల్లో ఫీవర్‌ నుంచి జీవితకాలం పాటు రక్షణ ఇస్తుంది’ అని జోహన్‌ నెయట్స్‌ వివరించారు. ఇలా కేవలం ఒక్క డోసుతోనే వైరస్‌ నుంచి సురక్షితంగా ఉండడంతో పాటు జీవితకాలం వ్యాధినిరోధక శక్తి కలిగి వుండడం ఎంతో కీలక విషయమని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. సాధారణ రిఫ్రిజిరేటర్ల ఉష్ణోగ్రత (2 నుంచి 8 డిగ్రీల సెల్సియస్‌) వద్దే నిల్వ ఉంచుకోవడం మరో ప్రయోజనం అని బెల్జియం పరిశోధకులు అభిప్రాయపడ్డారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని