
తాజా వార్తలు
రైతుల ఆందోళన: కేంద్రమంత్రుల కీలక భేటీ
దిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులతో ప్రభుత్వం జరిపిన చర్చలు కొలిక్కిరాలేదు. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలపై కేంద్రమంత్రులు మరోసారి భేటీ అయ్యారు. ఈ ఉదయం వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, వాణిజ్యమంత్రి పీయూష్ గోయల్.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసానికి చేరుకుని ఆయనతో సమావేశమయ్యారు. రైతులతో మంగళవారం జరిగిన భేటీ.. తదుపరి పరిణామాలు, అనుసరించాల్సిన వైఖరిపై ఈ ఇద్దరు మంత్రులు అమిత్ షాతో చర్చిస్తున్నారు.
వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు చేపట్టిన ఆందోళన ఏడో రోజుకు చేరిన విషయం తెలిసిందే. అయితే అన్నదాతల నిరసన తీవ్రమవుతున్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వం నిన్న వారితో చర్చలు జరిపింది. మంత్రులు నరేంద్రసింగ్ తోమర్, పీయూష్ గోయల్.. రైతుల మధ్య దాదాపు మూడు గంటల పాటు సాగిన చర్చలు ఎటూ తేలలేదు. సమస్యల పరిష్కారం కోసం కమిటీని నియమిస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదనను రైతు సంఘాలు మూకుమ్మడిగా తిరస్కరించాయి. దీంతో చర్చలను గురువారానికి వాయిదా వేశారు. రైతులు తమ అభ్యంతరాలను బుధవారం సాయంత్రంలోగా లిఖితపూర్వకంగా ఇవ్వాలని కేంద్రం సూచించింది.
మరోవైపు రైతులతో మరోమారు చర్చలకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమవుతున్నట్లు సమాచారం. రైతు సమస్యలపై చర్చించేందుకు వివిధ మంత్రిత్వ శాఖల అధికారుల జాబితా తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. వ్యవసాయ, గృహ, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు ఇందులో ఉంటారని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. కొత్త చట్టాల్లో ఉన్న ప్రతి నిబంధనపై కార్యదర్శి స్థాయిలో ఉన్న ఒక సీనియర్ అధికారి రైతులకు నిపుణుడిగా వివరించేందుకు సిద్దం చేస్తున్నట్లు సమాచారం.