close

తాజా వార్తలు

Published : 23/01/2020 01:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ముంబయి ఇక 24×7.. కేబినెట్‌ ఆమోదం

ముంబయి: ముంబయి నగరంలో మాల్స్‌, మల్టీప్లెక్సులు, షాపులు 24 గంటలూ తెరిచి ఉంచేందుకు ఉద్దేశించిన ‘ముంబయి 24 గంటలు’ విధానానికి మహారాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ నెల 27 నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. ఈ నిర్ణయం వల్ల మరిన్ని ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుందని పర్యాటక శాఖ మంత్రి, సీఎం ఉద్ధవ్‌ తనయుడు ఆదిత్య ఠాక్రే ఆశాభావం వ్యక్తంచేశారు. కేబినెట్‌ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లండన్‌లో ఈ విధానం అవలంబిస్తుండడంతో ఐదు బిలియన్‌ పౌండ్ల అదనపు ఆదాయం సమకూరుతోందన్నారు. షాపులు, మాల్స్‌, తినుబండారాల విక్రయశాలలు 24 గంటలూ తెరిచి ఉంచాల్సి అవసరం లేదని, ఎవరైతే రాత్రిపూట వ్యాపారం జరగాలని కోరుకుంటారో వారు మాత్రమే తెరుచుకోవచ్చని ఆదిత్య తెలిపారు.

తొలిదశలో భాగంగా వాణిజ్య ప్రాంతాల్లోని దుకాణాలు, తినుబండారాల విక్రయశాలలు, మాల్స్‌లోని థియేటర్లు, మిల్‌ కాంపౌండ్స్‌కు అనుమతిస్తున్నట్లు ఆదిత్య ఠాక్రే తెలిపారు. బాంద్రా- కుర్లా కాంప్లెక్స్‌, నారీమన్‌ పాయింట్‌లోని ఫుడ్‌ ట్రక్స్‌కు అనుమతిస్తామన్నారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే వారిపై జీవితకాలం నిషేధం విధిస్తామని హెచ్చరించారు. ఇకపై ముంబయి ప్రజలు రాత్రిపూట కూడా ఆహారాన్ని తినొచ్చని, సినిమాలు చూడొచ్చన్నారు. రాత్రిపూట షిఫ్టులు పూర్తిచేసుకొచ్చిన వారు, పర్యాటకులు రాత్రి 10 దాటిన తర్వాత ఆకలేస్తే వారి పరిస్థితేంటని, అలాంటి వారికి ఇకపై ఎప్పుడు పడితే అప్పుడు ఆహారం లభిస్తుందన్నారు. పబ్బులు, బార్లు మాత్రం యథావిధిగా 1.30 గంటలకే మూతపడతాయని చెప్పారు.

శాంతి భద్రతలు, పోలీసులపై ఒత్తిడి గురించి మంత్రి మాట్లాడుతూ.. పోలీసులపై ఒత్తిడి పడే అవకాశం లేదన్నారు. ఇప్పుడూ రాత్రి 1.30 గంటలు దాటితే షాపులు, వ్యాపార శాలలు మూసివేస్తున్నారో లేదో చూస్తున్నారని, ఇకపై పర్యవేక్షణ చూస్తారని చెప్పారు. తాజా నిర్ణయం వల్ల వారిపై ఎలాంటి పనిభారం ఉండదన్నారు. శాంతిభద్రల అంశంపై మరింత దృష్టి సారించనున్నామని తెలిపారు. మహా అఘాఢీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని భాజపా వ్యతిరేకిస్తుండడంపై ఆయన మాట్లాడుతూ.. ‘‘భాజపా.. యువతకు ఎప్పుడూ వ్యతిరేకమే. విద్యార్థుల పట్ల వారు ఎలా ప్రవర్తించారో మనం చూశాం’’ అంటూ జేఎన్‌యూ, జామియా మిలియా ఇస్లామియా ఘటనలను ఆదిత్య ఠాక్రే ప్రస్తావించారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.