
తాజా వార్తలు
వూహాన్ ఫైల్స్..!
* నాలుగు రోజులు కూడా నిలవని చైనా అబద్ధాలు
* గుట్టుబయట పెట్టిన కీలక డాక్యూమెంట్లు
ఇంటర్నెట్‌డెస్క్: కరోనా వైరస్ తమ దేశంలో పుట్టలేదని.. భారత్‌లో పుట్టిందని చైనా శాస్త్రవేత్తలు ఓ పరిశోధనా పత్రాన్ని కష్టపడి తయారు చేసి నాలుగు రోజులు దాటలేదు.. అమెరికాకు చెందిన ఆంగ్ల వార్త సంస్థ సీఎన్ఎన్ బాంబులాంటి కథనాన్ని ప్రచురించింది.
ఫిబ్రవరి 10వ తేదీన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆరోగ్య సిబ్బందిని పలకరించారు. ఆ సమయంలో చైనాలో కేవలం 2,478 కేసులు మాత్రమే నమోదయ్యాయని చైనా అధికారులు ప్రపంచానికి తెలియజేశారు.
హుబే ప్రావిన్స్‌లో అధికారుల అంతర్గత పత్రాలు కొన్ని సీఎన్ఎన్ చేతికి దక్కాయి. వీటి ప్రకారం ఇక్కడ ఫిబ్రవరి 10వ తేదీ నాటికే 5,918 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య చైనా బయటకు చెప్పిన దానికంటే రెట్టింపు ఎక్కువ. ఈ కేసులు మొత్తాన్ని చైనా అధికారులు వివిధ రకాలుగా వర్గీకరించారు. దీంతో మొత్తం అంకెను ఎప్పుడూ వెల్లడించలేదు.
హుబే ప్రావిన్స్‌కు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్‌కు చెందిన 117 పత్రాలు సీఎన్ఎన్ చేతికి దక్కాయి. చైనాలో కరోనా వైరస్ వ్యాపించాక ఈ స్థాయిలో సమాచారం బయటకు పొక్కడం ఇదే తొలిసారి. అక్కడి స్థానిక అధికారులకు కరోనాపై ఫిబ్రవరి నాటికే స్పష్టమైన అవగాహన ఉంది. అక్కడి అధికారులకు తెలిసింది.. బాహ్య ప్రపంచానికి వెల్లడించిన వాటిల్లో తేడాలు ఉన్నట్లు వీటిల్లో పేర్కొన్నారు. ఈ పత్రాల్లో అక్టోబర్ 2019 నుంచి ఏప్రిల్ 2020 మధ్య కీలక పరిణామాలను పేర్కొన్నాయి. చైనాలోని వైద్య, ఆరోగ్య విభాగాల్లో సదుపాయాల కొరత తీవ్రంగా ఉండటంతో బాధితులు విపరీతమైన ఒత్తిడి ఎదుర్కొన్నట్లు పేర్కొంది. దీంతోపాటు సమాచార సేకరణలో లోపాలను ఈ పత్రాలు స్పష్టంగా వెల్లడిస్తున్నాయి.
మార్చిలో పేర్కొన్న ఒక పత్రంలో కొన్ని స్వల్పలక్షణాల నుంచి పూర్తి స్థాయి వ్యాధిగా మారేందుకు 23.3రోజుల సమయం పడుతున్నట్లు పేర్కొనడం దీనికి నిదర్శనం. కేవలం తప్పులు జరగడంతోపాటు.. అధికారుల, రాజకీయ ఒత్తిళ్లు కూడా ప్రభావం చూపాయని తెలిపింది.
కరోనా జన్యు పరివర్తనంలో స్వల్పంగా మార్పులున్న భారత్ లేదా బంగ్లాదేశ్‌లోనే కరోనా మూలాలు ఉండవచ్చని చైనా శాస్త్రవేత్తలు ఓ పరిశోధనా పత్రంలో పేర్కొన్నారు. ‘ద అర్లీ క్రిప్టిక్ ట్రాన్స్మిషన్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ సార్స్ కోవ్-2 ఇన్ హ్యూమన్ హోస్ట్స్’ పేరిట ఉన్న ఈ పరిశోధనా పత్రాన్ని ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్‌కు చెందిన ప్లాట్‌ఫాం ‘SSRN.Com’ వెబ్సైట్ ప్రచురించింది. దాదాపు 17 దేశాల్లోని కరోనా వైరస్ జన్యుక్రమాలపై పరిశోధనలు జరిపిన అనంతరం ఈ నివేదికను రూపొందించినట్లు చైనా పరిశోధకులు పేర్కొన్నారు. ఫిలోజెనెటిక్ విశ్లేషణ పద్ధతిలో కరోనా మూలాలపై పరిశోధనలు చేసినట్లు పేర్కొన్నారు. ఈ విశ్లేషణ ప్రకారం వుహాన్‌లో కరోనా పుట్టలేదని చైనా శాస్త్రవేత్తలు తెలిపారు. భారత్, బంగ్లాదేశ్, అమెరికా, ఆస్ట్రేలియా, గ్రీస్, ఇటలీ, చెక్ రిపబ్లిక్, రష్యా, సెర్బియా దేశాల నుంచే కరోనా వ్యాప్తి మొదలై ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. ఇది బయటకు వచ్చిన నాలుగురోజుల్లోనే సీఎన్ఎన్లో వూహాన్ ఫైల్స్ లీక్ కావడం విశేషం.