అక్షరధామ్‌లో కేజ్రీవాల్‌ దీపావళి పూజలు

తాజా వార్తలు

Published : 14/11/2020 23:16 IST

అక్షరధామ్‌లో కేజ్రీవాల్‌ దీపావళి పూజలు

దిల్లీ: దేశ రాజధాని నగరంలోని అక్షరధామ్‌ ఆలయంలో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ దీపావళి పూజలు నిర్వహించారు. ఆయన సతీమణి సునీత కేజ్రీవాల్‌, డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా తదితరులతో కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్చరణల మధ్య కొనసాగిన ఈ పూజా కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలు వీక్షించారు. దిల్లీలో గాలి నాణ్యత తగ్గిపోవడం, కరోనా విజృంభణ నేపథ్యంలో దిల్లీలోని రెండు కోట్ల ప్రజలందరం కలిసి దీపావళి పండుగను జరుపుకొందామంటూ కేజ్రీవాల్‌ విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు.. ఈ రోజు రాత్రి  7.39గంటలకు మంత్రాలను పఠిద్దామని.. ప్రసారమాధ్యమాల్లో టీవీల ద్వారా ప్రత్యక్షప్రసారంలో అందరూ వీక్షించి పూజల్లో పాల్గొనాలని ఆయన కోరారు. పూజా కార్యక్రమం అనంతరం కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేస్తూ.. ఈ రోజు తన దిల్లీ కుటుంబానికి చెందిన 2కోట్ల మందితో దీపావళి జరుపుకొన్నట్టు తెలిపారు. అందరికీ ఆనందం, ఆరోగ్యం కలగాలని ప్రార్ధిస్తూ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. 

బాణసంచా కాల్చి 10మంది అరెస్టు
మరోవైపు, దిల్లీలో పూర్తి స్థాయిలో బాణసంచాపై నిషేధం ఉన్నప్పటికీ పలుచోట్ల కొందరు ఉల్లంఘిస్తున్నారు. ఈ కేసులో శనివారం ఒక్కరోజే 10 మందిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. అలాగే, టపాసులు విక్రయిస్తున్నవారిపైనా ఈ రోజు 12 కేసులు నమోదు చేసి వారి నుంచి 638.32 కిలోల బాణసంచాను స్వాధీనం చేసుకున్నారు. బాణసంచా విక్రయించిన వారిలో ఇప్పటివరకు 55మందిని అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి 3407.85 కిలోల బాణసంచా స్వాధీనం చేసుకున్నారు. టపాసులు పేల్చిన వారిలో ఇప్పటివరకు 21 మందిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. దిల్లీలో కరోనా విజృంభణతో పాటు కాలుష్యం ఆందోళనకర  స్థాయిలో పెరిగిపోతుండటంతో ఈ నెల 7 నుంచి 30 వరకు బాణసంచాపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని