అమెరికా కీలక పదవిలో భారత సంతతి వ్యక్తి

తాజా వార్తలు

Updated : 12/11/2020 09:54 IST

అమెరికా కీలక పదవిలో భారత సంతతి వ్యక్తి

వాషింగ్టన్‌: భారత సంతతికి చెందిన కాశ్‌ పటేల్‌ అమెరికా రక్షణ మంత్రి క్రిస్‌ మిల్లర్‌ ఛీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా కీలక పదవిలో నియమితులయ్యారు. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల మార్క్‌ ఎస్పర్‌ను తొలగించి క్రిస్‌ మిల్లర్‌ను తాత్కాలిక రక్షణ మంత్రిగా నియమించిన సంగతి తెలిసిందే. ఎస్పర్ తొలగింపు కొంతకాలంగా ఊహించినదే ఐనా, ఎన్నికల తరువాత ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. తదనంతరం రక్షణ మంత్రి వద్ద ఛీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ పదవిలో ఉన్న జెన్‌ స్టీవార్ట్‌ కూడా మంగళవారం రాజీనామా చేశారు. దీనితో నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌లో విధులు నిర్వహిస్తున్న కాశ్యప్‌ ప్రమోద్‌ పటేల్‌ను ఆ పదవిలో నియమిస్తున్నట్టు పెంటగాన్‌ ప్రకటించింది.  పటేల్‌ గతంలో ఉగ్రవాద నిరోధక శాశ్వత కమిటీలో సీనియర్‌ న్యాయవాదిగా పనిచేశారు.

39 సంవత్సరాల కాశ్‌ పటేల్‌ న్యూయార్క్‌లో జన్మించారు. ఈయన పూర్వీకులు గుజరాత్‌కు చెందినవారు కాగా.. తల్లితండ్రులు 70వ దశకంలోఆఫ్రికా నుంచి అమెరికాకు వలస వచ్చారు. ‘లిటిల్‌ ఇండియా’గా పిలిచే న్యూయార్క్‌లోని క్వీన్స్‌ ప్రాంతంలో స్థిరపడ్డారు. పటేల్‌ తన పాఠశాల విద్య న్యూయార్క్‌లోనూ, కళాశాల విద్యను వర్జీనియాలోను అభ్యసించారు. న్యాయవిద్యను న్యూయార్క్‌ లా స్కూల్‌లో పూర్తి చేశారు. అనంతరం ఫ్లోరిడాలో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా విధులు నిర్వహించారు. ఆ తర్వాత అమెరికా న్యాయశాఖలో అంతర్జాతీయ తీవ్రవాద విభాగంలో మూడేళ్లకు పైగా సేవలందించారు. ఈ సందర్భంగా పటేల్‌ ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన కేసుల్లో వాదించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని