
తాజా వార్తలు
మోదీతో ఆనాటి ఫొటోలను పంచుకున్న ఇవాంకా
ఇంటర్నెట్‌డెస్క్: సరిగ్గా మూడేళ్ల క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, ఆయన సలహాదారు ఇవాంకా భారత్‌కు వచ్చారు. ఈ సందర్భంగా భారత పర్యటనను గుర్తుచేసుకున్న ఇవాంకా తన సోషల్‌మీడియా ఖాతాలో ఆనాటి ఫొటోలను పంచుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఉన్న ఫొటోలను పోస్ట్ చేసిన ఆమె.. భారత్ - అమెరికా బంధం గురించి మాట్లాడారు. ‘ప్రపంచమంతా కొవిడ్-19పై పోరాడుతున్న సమయంలో.. అంతర్జాతీయ భద్రత, స్థిరత్వం, ఆర్థిక శ్రేయస్సును ప్రోత్సహించడంలో మన బలమైన స్నేహ బంధం గతంలో కంటే మరింత ప్రాధాన్యం పొందింది’ అని ఇవాంకా తన ఇన్‌స్టాలో రాసుకొచ్చారు.
2017 నవంబరులో ఇవాంకా తొలిసారిగా భారత్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో జరిగిన గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్‌కు ఇవాంకా హాజరయ్యారు. ఈ సదస్సు కోసం అమెరికా నుంచి వచ్చిన 350 మంది ప్రతినిధుల బృందానికి ఆమె నాయకత్వం వహించారు. ఆ సదస్సులో ప్రధాని మోదీని కలిసిన ఇవాంకా.. ఆయనపై ప్రశంసలు వర్షం కురిపించారు.
ఇటీవల ఇవాంకా మరోసారి భారత్‌లో పర్యటించారు. ఈ ఏడాది ఆరంభంలో తన తండ్రి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి భారత్‌కు వచ్చిన ఇవాంకా దంపతులు గుజరాత్లో నిర్వహించిన నమస్తే ట్రంప్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పర్యటన సందర్భంగా ఆగ్రాలోని చారిత్రక కట్టడం తాజ్‌మహల్‌ను కూడా సందర్శించారు.