హెచ్‌-1బీ వీసాదారుల భారీ నిరసన ర్యాలీ!

తాజా వార్తలు

Published : 24/07/2020 10:45 IST

హెచ్‌-1బీ వీసాదారుల భారీ నిరసన ర్యాలీ!

వాషింగ్టన్‌: గ్రీన్‌ కార్డుల జారీకి సంబంధించిన ఓ కీలక బిల్లు నిలిచిపోవడంపై అమెరికాలో భారతీయులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం వాషింగ్టన్‌లో ‘ఈక్వాలిటీ ర్యాలీ’ పేరిట ప్రదర్శన నిర్వహించారు. 

అమెరికాలో సుదీర్ఘకాలంగా ఉంటున్న వైద్యులు, ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు ఇతర నైపుణ్యం గల ఉద్యోగులు గ్రీన్‌ కార్డు కోసం చాలా కాలం నిరీక్షించాల్సి వస్తోంది. దీంతో ప్రస్తుత విధానంలో మార్పులు తెస్తూ ‘తొలుత వచ్చిన వారికి తొలి ప్రాధాన్యం’ విధానంతో గ్రీన్‌ కార్డులు జారీ చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ‘ఫెయిర్‌నెస్‌ ఫర్‌ హై స్కిల్డ్‌ ఇమ్మిగ్రంట్స్‌ యాక్ట్‌’ పేరిట బిల్లును తీసుకువచ్చారు. దీని ద్వారా ప్రస్తుతం ఉద్యోగ వీసాలపై దేశాలవారీగా ఉన్న ఏడు శాతం పరిమితిని తొలగించాలని నిర్ణయించారు. అయితే, దీన్ని డెమొక్రటిక్‌ పార్టీకి చెందిన సెనెటర్‌ డిక్‌ డర్బిన్‌ వ్యతిరేకించడంతో బిల్లు సెనేట్‌లోనే నిలిచిపోయింది. ఆయన తీరుకు నిరసనగా భారతీయ హెచ్‌-1బీ వీసాదారులు ఆందోళన చేపట్టారు. భారతీయుల పట్ల ఉన్న ద్వేషాన్ని వదులుకోవాలని ప్లకార్డులు ప్రదర్శించారు. నినాదాలు చేశారు. ఎన్నో ఏళ్లుగా అమెరికాలో ఉంటూ దేశ ఆర్థిక వృద్ధికి కృషి చేస్తున్న వారికి గ్రీన్‌ కార్డుల జారీని అడ్డుకోవడాన్ని అన్యాయమన్నారు.  

గ్రీన్‌ కార్డుల జారీలో ఉన్న బ్యాక్‌లాగ్‌ని కూడా క్లియర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుత నిరీక్షణ సమయం ఇలాగే కొనసాగితే గ్రీన్‌ కార్డు జారీకి 150 ఏళ్లు పట్టే అవకాశం ఉందని తెలిపారు!  అలాగే, ఆశ్రయం కోసం దేశంలోకి అక్రమంగా వచ్చిన మైనర్లకు కల్పించే అన్ని హక్కుల్నీ చట్టబద్ధంగా దేశంలోకి వచ్చిన మైనర్లకు కూడా కల్పించాలని డిమాండ్‌ చేశారు. దీంతో హెచ్‌-1బీ వీసాదారులపై ఆధారపడి హెచ్‌-4 వీసా కలిగి ఉన్న పిల్లలకు నేరుగా గ్రీన్‌కార్డు జారీ చేసే అవకాశం కలుగుతుందన్నారు. ఇక వారు గ్రీన్‌ కార్డు పొందడానికి స్టుడెంట్‌ వీసా, హెచ్‌-1బీ వంటి ఇతర వీసా కేటగిరీలకు మారాల్సిన అవసరం ఉండదన్నారు. ఆశ్రయం కోరుతూ వచ్చిన మైనర్లకు చట్టబద్ధంగా అన్ని హక్కుల్ని  కల్పిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని