
తాజా వార్తలు
రైతుల ఆందోళన: ట్రూడో వ్యాఖ్యలు అనవసరం
కెనడా ప్రధానిగా దీటుగా బదులిచ్చిన భారత్
దిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. ట్రూడో వ్యాఖ్యలు అసమగ్రంగా ఉన్నాయని పేర్కొంది. ప్రజాస్వామ్య దేశంలోని అంతర్గత వ్యవహారాల్లో ఇతరుల జోక్యం అనవసరమంటూ కెనడాకు బదులిచ్చింది. అసలేం జరిగిందంటే..
గురునానక్ జయంతి సందర్భంగా ఓ ఆన్లైన్ సమావేశంలో పాల్గొన్న జస్టన్ ట్రూడో.. రైతుల ఆందోళనపై స్పందించారు. ‘భారత్లో రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారనే వార్త తెలిసింది. పరిస్థితి ఆందోళనకరంగా కనిపిస్తోంది. మా ఆలోచనంతా వారి కుటుంబసభ్యుల గురించే. శాంతియుతంగా నిరసన తెలియజేసే వారి హక్కుల పరిరక్షణకు కెనడా మద్దతు ఇస్తుందని మీకు గుర్తు చేయాలనుకుంటున్నాం. మేము చర్చల ప్రాముఖ్యతను విశ్వసిస్తాం. మా ఆందోళనను భారత అధికారుల వద్ద వ్యక్తం చేశాం. మనందరిని ఒకదగ్గర కలిపి ఉంచే క్షణం ఇది’ అని రైతులకు మద్దతు తెలిపారు. ట్రూడోతో పాటు మరికొందరు కెనడా నేతలు కూడా ఇదేవిధంగా మాట్లాడారు.
దీంతో కెనడా ప్రధాని వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా స్పందించింది. ‘భారత్లోని రైతుల గురించి కొందరు కెనడా నేతలు అసమగ్ర వ్యాఖ్యలు చేయడం చూస్తున్నాం. అలాంటి వ్యాఖ్యలు అనవసరం. ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశంలోని అంతర్గత వ్యవహారాల్లో ఇతరుల జోక్యం ఉండకూడదు’ అని కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ స్పష్టం చేశారు.
కాగా.. ట్రూడో వ్యాఖ్యలను పలు రాజకీయ పార్టీలు కూడా ఖండించాయి. ఇది తమ అంతర్గత వ్యవహారమని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేదీ అనగా.. ఇలాంటి స్పందనను ఆహ్వానించలేమని ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొంది.