ఆ రెండుమాత్రలు కలిపివాడితే ప్రమాదమేనా?

తాజా వార్తలు

Published : 26/08/2020 16:15 IST

ఆ రెండుమాత్రలు కలిపివాడితే ప్రమాదమేనా?

HCQ, అజిత్రోమైసిన్‌ కలిపి వాడటంపై తాజా నివేదికలు
స్వల్పకాలిక కోర్సుతో ప్రమాదం లేదంటున్న నిపుణలు

వాషింగ్టన్‌: కరోనా చికిత్సలో భాగంగా హైడ్రాక్సీక్లోరోక్విన్‌తోపాటు అజిత్రోమైసిన్‌ మాత్రలను(HCQ+AZM) ఒకేసారి వాడడం వల్ల హృద్రోగ సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఒక్కోసారి వీటివల్ల ప్రాణాలకే ప్రమాదం పొంచివుందని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అయితే స్వల్పకాలిక కోర్సులో భాగంగా HCQ ముప్పై రోజుల పాటు వాడితే మాత్రం ఎలాంటి ప్రమాదం లేదని, దీర్ఘకాలికంగా వాడితేనే హృద్రోగ సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. దీర్ఘకాలికంగా HCQ వాడటం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి గత ఏప్రిల్‌లోనే యూరోపియన్‌ మెడిసిన్స్‌ ఏజన్సీ(ఈఎంఏ) కూడా హెచ్చరించింది. మరింత పరిశోధనలు జరిపిన అనంతరం మరో నివేదిక దీన్ని స్పష్టం చేసింది. తాజాగా ఈ పరిశోధన నివేదిక ప్రముఖ అంతర్జాతీయ జర్నల్‌ లాన్సెట్‌ రూమటాలజీ,  MedRxivలలోనూ ప్రచురితమైంది.

కరోనావైరస్‌ విజృంభిస్తోన్న సమయంలో ప్రపంచవ్యాప్తంగా మలేరియాకు ఉపయోగించే HCQ నియంత్రిస్తోన్నట్లు నిపుణులు అంచనా వేశారు. దీంతో HCQ వాడకం పెరిగింది. దీనిపై విస్తృత పరిశోధనలు జరగాల్సి ఉందని అంతర్జాతీయ నిపుణులు ఇప్పటికే సూచించారు. ప్రస్తుతం ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం, ముప్పై రోజుల స్వల్పకాలిక కోర్సు వల్ల ప్రమాదమేమీ లేదని తేలింది. కానీ వీటిని దీర్ఘకాలికంగా అజిత్రోమైసిన్‌తో కలిపి వాడితేనే ప్రమాదమని పరిశోధన పత్రాన్ని రూపొందించిన డానియల్ ప్రైటో అల్హాంబ్రా వెల్లడించారు. గడిచిన 20 సంవత్సరాలలో HCQ వాడిన దాదాపు 9లక్షల 50వేల మంది సమాచారాన్ని క్రోడీకరించిన అనంతరం దీన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు. జర్మనీ, జపాన్‌, నెదర్లాండ్స్‌, స్పెయిన్‌, యూకే, అమెరికా దేశాలకు చెందిన సమాచారాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకున్నామని తెలిపారు. అయితే దీనికి సంబంధించిన సమాచారంపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని ఆరోగ్యరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కరోనా వైరస్‌ చికిత్సలో ప్రతిఒక్కరికీ హైడ్రాక్సీక్లోరోక్విన్‌ వాడవద్దని తాజాగా అమెరికా అంటువ్యాధుల సొసైటీ(ఐడీఎస్‌ఏ) కూడా సూచించింది. అంతేకాకుండా వీటికి సంబంధించిన తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇదిలా ఉంటే, కరోనా చికిత్సలో HCQ ఆశించిన ఫలితాలు చూపించడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా పలుసార్లు అభిప్రాయపడిన విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని