అమెరికాలో గాంధీ విగ్రహం అపవిత్రం

తాజా వార్తలు

Updated : 13/12/2020 14:50 IST

అమెరికాలో గాంధీ విగ్రహం అపవిత్రం

ఖలిస్థానీ వేర్పాటువాదుల దుశ్చర్య

వాషింగ్టన్‌: అమెరికాలో ఖలిస్థానీ దౌర్జన్యకారులు గాంధీ విగ్రహాన్ని అపవిత్రం చేయడాన్ని అక్కడి భారత రాయబార కార్యాలయం తీవ్రంగా ఆక్షేపించింది. ఈ విషయాన్ని స్థానిక భద్రతా వ్యవస్థ దృష్టికి తీసుకెళ్లింది. యావత్తు ప్రపంచం సత్యం, అహింస, శాంతికి ప్రతీకగా భావించే గాంధీజీ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపింది. ఈ దుర్ఘటనకు సంబంధించిన వివరాల్ని అమెరికా విదేశాంగశాఖకు తెలిపామని పేర్కొంది. వీలైనంత త్వరగా దోషుల్ని న్యాయవ్యవస్థ ముందుకు తీసుకురావాలని కోరింది. దిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా వాషింగ్టన్‌లో నిర్వహించిన ర్యాలీలో దూరిన కొంతమంది దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ ఘటనను దిల్లీలో ఆందోళన చేస్తున్న సిక్కు వర్గాలు సైతం తీవ్రంగా ఖండించాయి. నిరసనలు శాంతియుతంగా జరగాలని కోరాయి. రైతుల ఆందోళన కేవలం చట్టాల రద్దుకు మాత్రమే పరిమితమని.. దీనిలో ఇతర అసాంఘిక శక్తులకు తావులేదని స్పష్టం చేశారు.

దేశంలో నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులకు మద్దతుగా అమెరికాలో సిక్కు వర్గానికి చెందిన వారు శనివారం భారీ కార్ల ర్యాలీ నిర్వహించారు. న్యూయార్క్‌, న్యూజెర్సీ, పెన్సిల్వేనియా, ఇండియానా, ఒహైయో, నార్త్‌ కరోలైనా ప్రాంతాల నుంచి వచ్చిన నిరసనకారులు శాంతియుతంగా రాజధాని వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయానికి చేరుకున్నారు. వీరి నిరసనల్ని ఆసరాగా చేసుకున్న ఖలిస్థానీ వేర్పాటువాదులు తమ జెండాల్ని చేతబూని ర్యాలీ మధ్యలో దూరారు. చూస్తుండగానే విగ్రహం వద్దకు చేరుకొని ఖలిస్థానీ జెండాతో గాంధీ విగ్రహాన్ని కప్పేసి ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. దీన్ని గమనించిన ఓ సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్‌.. చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని దౌర్జన్యకారుల్ని హెచ్చరించారు. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. 

జూన్‌ 26న అధ్యక్షుడు ట్రంప్‌ తెచ్చిన కొత్త చట్టం ప్రకారం.. అమెరికాలో ఉన్న విగ్రహాలు, మెమోరియళ్ల ధ్వంసం, అపవిత్రం, కూల్చడం వంటి దుశ్చర్యలకు పాల్పడితే నేరంగా పరిగణిస్తారు. దోషిగా తేలితే 10 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.

ఇవీ చదవండి...

హీరో 2020గా భారత సంతతి వ్యక్తి !

చందమామ పైకి భారత సంతతి వ్యక్తి


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని